కేబీఆర్ చుట్టూ వన్ వే: ట్రాఫిక్ ప్లాన్ ను ప్రతి ఒక్కరు ఫాలో కావాలి: సజ్జనార్

కేబీఆర్ చుట్టూ వన్ వే: ట్రాఫిక్ ప్లాన్ ను ప్రతి ఒక్కరు ఫాలో కావాలి: సజ్జనార్

హైదరాబాద్ లో హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా దాదాపు 1300 కోట్ల రూపాయల భారీ వ్యయంతో కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.ఈ పనులను అనుకున్న సమయానికంటే ముందే పూర్తి చేసేందుకు... అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నుంచే కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు.

ఈ క్రమంలో వన్ వే ట్రాఫిక్ ను పరిశీలించిన హైదరాబాద్ సీపీ సజ్జనార్  .. ఈ వన్-వే విధానం వల్ల పనులు వేగంగా జరుగుతాయని, ప్రారంభంలో ఒకటి రెండు చోట్ల చిన్నపాటి ఇబ్బందులు తలెత్తినా... వాటిని వెంటనే క్లియర్ చేస్తామని స్పష్టం చేశారు.వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అధికారులు నాలుగు షిఫ్ట్ లలో పనిచేస్తున్నారని చెప్పారు.ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ జోన్ల అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.బస్ స్టాప్‌ల మార్పునకు సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ ఎండీతో చర్చలు జరిపామన్నారు.ట్రాఫిక్ పోలీసులు ఇస్తున్న సూచనలను విధిగా పాటిస్తూ, వాహనదారులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు సజ్జనార్. 

ఈ వన్-వే నిర్ణయంపై జీహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ... జీహెచ్ఎంసి సివిల్ వర్క్స్ అన్నీ సకాలంలో పూర్తి చేయడానికి ఈ విధానం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. వాహనదారుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు  కూడా చేస్తున్నట్లు వెల్లడించారు.  మొదటి రెండు మూడు రోజులు ట్రాఫిక్ పరంగా కాస్త ఇబ్బందిగా ఉన్నా... ఆ తర్వాత ప్రయాణం ఎంతో సురక్షితంగా, సాఫీగా సాగుతుందని భరోసానిచ్చారు. ఈ ప్రాజెక్టును నిర్దేశిత గడువు ప్రకారం... కచ్చితంగా రెండు సంవత్సరాలలో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు.