సూర్యాపేట, వెలుగు: కలెక్టర్ సంతకాన్ని ఓ బ్యాంక్ మేనేజర్ ఫోర్జరీ చేయగా, కోటక్ మహీంద్రా బ్యాంక్ సూర్యాపేట బ్రాంచ్ మేనేజర్ కోడూరు రఘు ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. వివరాలిలా ఉన్నాయి.. సూర్యాపేట డీఆర్డీవో సన్యాసయ్య, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పేరిట కోటక్ మహీంద్రా బ్యాంక్ సూర్యాపేట బ్రాంచ్‌లో జాయింట్ అకౌంట్ ఉంది. దీనికి సంబంధించిన సంతకాల అప్‌డేట్ ప్రక్రియ ఇటీవల జరిగింది.
నిబంధనల ప్రకారం కలెక్టర్ నుంచి సంతకం తీసుకోవాల్సి ఉండగా.. బ్యాంక్ మేనేజర్ రఘు ప్రసాద్ కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. ఈ విషయాన్ని కలెక్టరేట్ సిబ్బంది గుర్తించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తన సంతకాన్నే ఫోర్జరీ చేయడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఈ నెల 16న చివ్వెంల పోలీస్ స్టేషన్‌లో అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం రఘు ప్రసాద్‌ను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
