సూర్యాపేట: పరిశ్రమల ముసుగులో 12 ఎకరాలు కబ్జా!..అక్రమ కట్టడాలను కూల్చేసిన ఫారెస్ట్ ఆఫీసర్లు

సూర్యాపేట: పరిశ్రమల ముసుగులో 12 ఎకరాలు కబ్జా!..అక్రమ కట్టడాలను కూల్చేసిన ఫారెస్ట్ ఆఫీసర్లు

సూర్యాపేట వెలుగు: పరిశ్రమల ముసుగులో అటవీ భూములను ఆక్రమిస్తున్న అక్రమార్కుల బాగోతం బట్టబయలైంది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం సుల్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని సర్వే నంబర్ 88లో ఏకంగా 12.06 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓ సిమెంట్ కంపెనీ  ఆక్రమించినట్లు తేలింది. విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు సోమవారం భారీ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను జేసీబీలతో నేలమట్టం చేసి, భూమిని స్వాధీనం చేసుకున్నారు. సుల్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ రిజర్వ్ ఫారెస్ట్ భూములను సిమెంట్ ఫ్యాక్టరీ ఆక్రమించిందని స్థానికుడు ఇచ్చిన ఫిర్యాదుతో పాటు, హైకోర్టులో దాఖలైన పిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విజిలెన్స్ విభాగం లోతుగా దర్యాప్తు చేపట్టింది. 

శాటిలైట్ ఇమేజింగ్ రికార్డులను పరిశీలించగా.. ఈ ఆక్రమణలు నిన్న మొన్నటివి కావని, 2008 నుంచే దశలవారీగా అటవీ సరిహద్దులను చెరిపేస్తూ కబ్జాకు పాల్పడినట్లు స్పష్టమైంది. నిబంధనలకు విరుద్ధంగా రిజర్వ్ ఫారెస్ట్ భూమిలోనే కంపెనీ సెక్యూరిటీ పోస్ట్, మెయిన్ ఎంట్రన్స్ గేట్, ఓపెన్ ఆడిటోరియం, వాటర్ ప్లాంట్ వంటి శాశ్వత భవనాలు నిర్మించినట్లు అధికారులు నిర్ధారించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో అటవీశాఖ అధికారులు యాక్షన్ మొదలుపెట్టారు. అక్రమంగా నిర్మించిన భవనాలను జేసీబీలతో కూల్చివేశారు. కబ్జాకు గురైన 12 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమిని తిరిగి తమ ఆధీనంలోకి తీసుకొని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.