- రూ. 17 కోట్లతో అభివృద్ధి పనులు
- 90 శాతం పూర్తి కావచ్చిన ఆధునీకరణ పనులు
- అందుబాటులోకి లిఫ్టులు, పార్కింగ్, కొత్త రోడ్లు
- తుది దశలో 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు
నల్గొండ, వెలుగు: నల్గొండ రైల్వే స్టేషన్‌కు కార్పొరేట్ లుక్ వస్తోంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. సుమారు రూ. 17 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో ఇప్పటికే 90 శాతం పూర్తి కాగాప్లాట్‌ఫారమ్‌ల దగ్గర నుంచి పార్కింగ్ ఏరియా వరకు ఆధునిక హంగులతో ముస్తాబవుతున్నాయి. స్టేషన్‌లో లిఫ్ట్‌లు, పార్కింగ్, కొత్త రోడ్లను అందుబాటులోకి రానున్నాయి. నల్గొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో రైల్వే స్టేషన్ అభివృద్ధి కూడా కీలకంగా మారింది. ఈ పనులన్నీ పూర్తి చేసి స్టేషన్ ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.
ప్రయాణికులకు హైటెక్ వసతులు
స్టేషన్ లోపలికి రాగానే ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా లిఫ్టు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. గతంలో వర్షం వస్తే ఇబ్బంది పడే ప్రయాణికుల కోసం ప్లాట్‌ఫారమ్ లపై కొత్తగా కవర్లను ఏర్పాటు చేశారు. స్టేషన్ బయట అప్రోచ్ రోడ్లను వెడల్పు చేసి, వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. స్టేషన్ ఆవరణ అంతా సీసీ రోడ్లు, టైల్స్‌తో మెరిసిపోతోంది. దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతులు, ప్లాట్‌ఫారమ్ సర్ఫేసింగ్(ఫ్లోరింగ్) పనులు చివరి దశకు చేరుకున్నాయి. స్టేషన్‌లో కీలకమైన 12 మీటర్ల వెడల్పు గల భారీ ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ప్రయాణికులు ఒక ప్లాట్‌ఫారమ్ నుంచి మరోదానికి సులువుగా వెళ్లేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. పాత వెయిటింగ్ హాల్‌ను కూడా రిపేర్ చేస్తున్నారు. ఈ పనులు పూర్తయితే నల్గొండ స్టేషన్ తెలంగాణలోనే మోడల్ స్టేషన్‌గా నిలవనుంది.
