తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏండ్లు పూర్తయ్యాయి. కానీ, పాలకుల నిర్ణయాలలో ప్రజల భాగస్వామ్యం పెరగలేదు. ప్రజలతో సంప్రదింపులు లేవు. సుస్థిర అభివృద్ధిపట్ల ఆలోచన లేదు. నినాదాల హోరు, వాగ్దానాల జోరు, బీరాల పలుకులు పెరిగిపోయాయి. ప్రజా పాలనలో కూడా తెలంగాణ ప్రభుత్వ తీరు మారలేదు. ప్రజల ఆవేదన ఎవరికీ పట్టడం లేదు. రాజకీయ నాయకులు ఇంతే అనుకుంటున్న దశలో ఇతర రాజ్యాంగ పిల్లర్స్ కూడా తెలంగాణ ప్రజలను అర్థం చేసుకోవడం లేదు. వారి బాధలను పట్టించుకోవడం లేదు. మీడియాలో వస్తున్న సమాచారంలో అనేక రీతులలో లోపాలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ నత్తనడకలో పరిష్కారాలు తక్కువ, పరిణామాలు ఎక్కువ. న్యాయ వ్యవస్థ ధిక్కరణ అధికారులు చేస్తున్నా, ధిక్కరణ కేసులు ఎక్కువ అవుతున్నా పట్టించుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని ప్రచారం అంతర్గత రాజకీయ శక్తులే చేస్తున్న తరుణంలో.. అత్యంత అధికస్థాయిలో స్థూల ఆర్థిక ఉత్పత్తికి దోహదపడుతున్న రంగారెడ్డి జిల్లాలో మూల తెలంగాణవాసుల పేదరికం ఎవరికీ కనపడడం లేదు.
తరాల నుంచి నమ్ముకున్న భూమికి ఈ రోజు ధరల రెక్కలు వస్తే వాటిని అమ్ముకునే పరిస్థితిని తెలంగాణ ‘అభివృద్ధి’ ప్రణాళికలు ప్రజలను ఉసికొల్పుతున్నాయి. అంచెలంచెలుగా పెరుగుతున్న ధరలలో మొదటి దశలోనే అమాయక రైతులు భూమిహీనులు అవుతున్నారు. ఇంకోవైపు తెలంగాణ ప్రభుత్వం అతి వేగంగా ‘అభివృద్ధి’ పనులను తెర మీదికి తెస్తూ, కనీస సంభాషణకు, సంప్రదింపులకు, సామాజికంగా మధ్యవర్తిత్వం వహించకుండా, ఇతర అవకాశం ఇవ్వకుండా భూసేకరణ చేస్తున్నది. గత 12 ఏండ్లలో చేపట్టిన ‘అభివృద్ధి’ ప్రాజెక్టులు ఏవీ తెలంగాణ ప్రజలకు అక్కరకు వచ్చేవి కావు. తెలంగాణ ప్రజలు అడిగినవి కావు. బంగారు తెలంగాణ, తెలంగాణ రైజింగ్ 2047 ఇద్దరు వ్యక్తుల ఆలోచనా సమాహారం తప్పితే ప్రజాస్వామ్యయుతంగా చర్చించి, సంప్రదించి, సర్వామోదం పొందినవి కావు. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు తయారు చేసినవి తప్పితే తెలంగాణ ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు కావు.
ప్రాజెక్టులు గుదిబండలు
ప్రాజెక్టుల విషయానికి వస్తే అన్నీ గుదిబండలే. తెలంగాణ ప్రభుత్వం మీద, ఖజానా మీద, ప్రజల మీద ఈ గుదిబండలు, వాటివలన దీర్ఘకాలిక సమస్యలు అనేకం. తెలంగాణ రాష్ట్రం అప్పులలో కూరుకుపోవడానికి రాజకీయ స్వార్థంతో తీసుకున్న ప్రాజెక్టు, పథకాల నిర్ణయాలు. ఖర్చు ఎక్కువ. అతిగా చూపెడుతున్నారు. ప్రతి ప్రాజెక్టు ఆలోచన దశ నుంచి పూర్తిగా అమలు అయ్యేలోపట పదింతల ఖర్చు పెడుతున్నారు. ఏ ఒక్క ప్రాజెక్టు ఖర్చు మీద కూడా ఆడిట్ జరగడం లేదు. ఆడిట్ చేసిన అరకొర వాటిమీద కాగ్ ఇచ్చే సూచనలు, లేదా వ్యాఖ్యల మీద తదుపరి చర్యలు ఏమి లేవు. కాళేశ్వరం ఖర్చు ఎంత? మొదలుపెట్టినప్పటి నుంచి వివిధ దశలలో మార్పులు చేశారు. మార్పులు, దానితో కూడిన ఖర్చుల మీద ప్రజల నిఘా ఉంటుందని సమాచారం దాస్తున్నారు. ఇది ఒక కాళేశ్వరం మాత్రమే కాదు, అన్ని ప్రాజెక్టుల పరిస్థితి ఇంచుమించుగా ఇదే. గత 12 ఏండ్లలో తెలంగాణ ప్రభుత్వం తీరు నానాటికి తీసికట్టుగా తయారు అవుతున్నది. అవినీతి అన్నింట్లో పెరుగుతున్నది.
అప్పులు ఎవరు కట్టాలి?
యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు మీద రూ.50 వేల కోట్ల ఖర్చు పైన అయ్యింది. ఇంకా పూర్తి కాలేదు. ఈ మొత్తం ఖర్చు వచ్చినాక దానినుంచి వచ్చే విద్యుత్ అత్యంత ఖరీదుగా మారుతుంది. ఆ విద్యుత్ వాడితే ఆ భారం పరిశ్రమల మీద పడుతుంది. వాడకపోతే అందరి మీద పడుతుంది. దానికోసం చేసిన అప్పులు ఎవరు కట్టాలి? అవసరమైనచోట ఖర్చు నిధులు లేని పరిస్థితి. సెక్రటేరియట్ భవన నిర్మాణం ఖర్చు రూ.1600 కోట్లు అయ్యింది. ఇంకా పూర్తిగా బిల్లులు చెల్లించలేదు. పార్లమెంటు భవనానికి రూ.800 కోట్లు అయితే ఇక్కడ దానికి రెండింతలు అయ్యింది. కాళేశ్వరం ఫైళ్లు మాయమవడం గురించి కించిత్తు చింతన ప్రభుత్వంలో ఏ ఒక్క సంస్థకు లేకపోవడం రాజ్యాంగ విరుద్ధ ప్రభుత్వాధినేతల తీరుకు అద్దం పడుతున్నది. యాదాద్రి, భద్రాద్రి లాంటి అనవసర ప్రాజెక్టుల సరసన ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ లాంటివి చేరినాయి. పారిశ్రామిక వాడల ప్రణాళికలు కూడా ఎక్కువ అయినాయి. దాదాపు 2.5 లక్షల ఎకరాల భూమి నిధి ఉన్నా, ఆ భూములను విస్మరించి రియల్ ఎస్టేట్ కోసం కొత్త పారిశ్రామికవాడలు ప్రకటిస్తున్నారు. కోర్టులు ఈ రకమైన ప్రభుత్వ వ్యూహాన్ని ఎదుర్కొనే అవకాశాన్ని కల్పించడం లేదు. పచ్చటి,
సాగు యోగ్యమైన భూములను పరిశ్రమలకు
మళ్ళించడం ఎంతవరకు సబబు?
ముందస్తు ప్రణాళికలు, సంప్రదింపులు లేవు విద్యుత్ సంస్థల మీద ఉన్న అప్పులు రూ.80 వేల కోట్లు దాటినాయి. వ్యవసాయానికి ఇస్తున్న విద్యుత్ సబ్సిడీ ఒకే కారణం కాదు. ఇందులో యాదాద్రి, భద్రాద్రి సహా అనేక నిర్ణయాలు ఉన్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు మీద చేసిన అప్పు హెచ్.ఎం.డి.ఏ కడుతూనే ఉన్నది. దానిని అమ్మేశారు. అప్పు మిగిలింది. ఆస్తి పోయింది. రీజనల్ రింగు రోడ్డు అవసరం గురించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఒక సాధికార ప్రకటన రాలేదు. కొడంగల్ నుంచి హైదరాబాద్‌కు వ్యవసాయ ఉత్పత్తులు తరలించడానికి 10 వరుసల రోడ్డు అక్కడి కొడంగల్ సంస్థ ప్రకటించింది. అంత పెద్ద రోడ్డు అవసరమా? ముందస్తు ప్రణాళికలు, సమగ్ర ఆలోచన, ప్రజలతో సంప్రదింపులు వంటివి లేనే లేవు. హైదరాబాద్ మెట్రో రైల్ ఒక కమర్షియల్ ప్రాజెక్ట్. ప్రజల ప్రయాణం తీరును బట్టి, వ్యాపార అవకాశాల బట్టి మార్గాలను ఎంచుకుంటారు. మెట్రో ప్రయాణం సౌకర్యంగా ఉన్నా ‘ఖరీదు’ అయిన ప్రయాణ పద్ధతి. సబ్సిడీలు లేనిదే నడవదు. సామాన్య ప్రజలు వాడే బస్సుల సంఖ్య, వసతులు, డిపోలు, ఉద్యోగుల సంఖ్యను పెంచడానికి, సబ్సిడీలు ఇవ్వటానికి వెనుకాడుతున్న తెలంగాణ ప్రభుత్వం ఈ ఖరీదు అయిన రవాణా మార్గం ఎంచుకోవటం ప్రజా శ్రేయస్సు కోసమే అని భావించలేం.
అప్పుల భారం నివారించాలి
కేవలం బ్రాండ్ ఇమేజ్ కోసం ప్రభుత్వ నిధులను అనవసరంగా ఖర్చు పెడుతున్నారు. మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు కూడా ‘అందం’ మీద ఖర్చు తప్పితే, అవసరం మీద కాదు. పాత అప్పుల భారం తగ్గించుకోవడానికి ఉపాయం కావాలి. కొత్తగా అప్పులు చేయకుండా, ప్రజల మీద అప్పుల భారం నివారించే విజ్ఞత తెలంగాణ ప్రభుత్వ పాలకులలో రావాలి. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్, నీళ్ళు, రవాణా, హైదరాబాద్ అభివృద్ధి, వ్యవసాయం వంటి కీలక అంశాల మీద ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉండే మౌలిక సదుపాయాల మీద పెట్టుబడులు పెట్టడానికి నిధులు లేవు. వాటిమీద దృష్టి పెట్టకుండా విదేశీ పెట్టుబడిదారులే లక్ష్యంగా ప్రాజెక్టులు ప్రకటించటం సబబు కాదు. నిజమైన ప్రజా పాలనలో తెలంగాణా ప్రభుత్వం ప్రతి ప్రాజెక్టు మీద ప్రజలతో విస్తృత సంప్రదింపులు విధిగా చెయ్యాలి. ప్రాజెక్టుల అవినీతి తేల్చి, భాధ్యులను తేల్చి వారికి శిక్షపడేటట్లు చేయడంతోపాటు, ఆయా ప్రాజెక్టులను ఎట్లా ఉపయోగించాలి అని కూడా ఆలోచించాలి. తగిన వ్యూహాలు రచించాలి.
కొత్త భాష..పాత పద్ధతి
నేటి పాలకులు కొత్త భాష మాట్లాడుతూ.. పాత పద్ధతినే కొనసాగిస్తూ తాము ఏదో మార్పు చేస్తున్నట్టు ప్రజలను భ్రమించేవిధంగా ఉన్నారు. ఒక డజను పైగా ప్రాజెక్టులు పాతవి, కనీస సమీక్ష లేకుండానే కొనసాగిస్తున్నారు. కొత్త పాలకులు పోయిన ప్రభుత్వం అవినీతిని ఎత్తి చూపుతున్నా అదే దారిన నడిచే ప్రయత్నం చేస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పులలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం మాత్రమే కాదు. తీసుకున్న నిర్ణయాలు, నిర్ణయాలు తీసుకున్న పద్ధతి, చేపట్టిన ప్రాజెక్టులు, రుద్దిన పరిష్కారాలు, చేసిన అప్పులు, మార్చిన పాలనా సంస్కృతి, మిగిల్చిన గుదిబండలు కూడా సమస్యాత్మకమే. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు, నిర్వహిస్తున్న సమావేశాలు, కొనసాగిస్తున్న పద్ధతులు కూడా నిరాశాజనకంగా ఉన్నాయి. పాత ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించిన ప్రస్తుత మంత్రులు ఇదివరకు దాచిపెట్టిన జీవోలు కూడా బయటపెట్టడం లేదు. వారు విడుదల చేస్తున్న జీవోలను కూడా దాచిపెడుతున్నారు. ధరణి పోయి భూభారతి వచ్చింది. పాత సమస్యలు పరిష్కారం కాకపోగా అదనంగా సమస్యలు వచ్చిపడుతున్నాయి. రైతుబంధు పోయింది, రైతు భరోసా వచ్చింది. కౌలు రైతులకు కన్నీళ్లు మాత్రమే మిగిలినాయి. రైతుకు ప్రతి బస్తాలో తరువు తగ్గలేదు. మార్కెట్లో బియ్యం ధర తగ్గలేదు.
- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్
