Movie Review: చిన్నపిల్లలకు ఈ వీకెండ్ మంచి ఛాయిస్ అవుతుందా? ఫహాద్ ఫాజిల్ ఫాంటసీ మూవీ ఎలా ఉందంటే?

Movie Review: చిన్నపిల్లలకు ఈ వీకెండ్ మంచి ఛాయిస్ అవుతుందా? ఫహాద్ ఫాజిల్ ఫాంటసీ మూవీ ఎలా ఉందంటే?

విభిన్నమైన కథలు, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్.. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్‌.ఎస్‌. కార్తికేయ నిర్మించిన ఈ చిత్రానికి శశాంక్ యేలేటి దర్శకత్వం వహించారు.

ఫాంటసీ, కామెడీ, థ్రిల్ అంశాలను మేళవించిన ఈ సినిమా ఇవాళ (అక్టోబర్ 2, 2026న) థియేటర్లలో విడుదలైంది. మరి ఫహాద్ ఫాజిల్ హీరోగా ఎలా మెప్పించాడు? చిన్నపిల్లలతో కలిసి ఈ వీకెండ్ థియేటర్లలో చూసేంతగా ఈ ఫాంటసీ మూవీ ఆకట్టుకుందా? అసలు సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథేంటంటే:

సూరి (ఫహాద్ ఫాజిల్) డబ్బు కోసం ఏ పని చేయడానికైనా వెనుకాడని వ్యక్తి. చిన్న చిన్న మోసాలు, మ్యాజిక్ ట్రిక్స్ చేస్తూ తన అవసరాలను నెట్టుకొస్తుంటాడు. అయితే ఓ సందర్భంలో స్థానిక గ్యాంగ్‌స్టర్‌ దగ్గర చిక్కుకోవడంతో భారీ మొత్తంలో డబ్బును చాలా తక్కువ సమయంలో సమకూర్చాల్సిన పరిస్థితి వస్తుంది.

ఆ డబ్బు కోసం సూరి చేసే ప్రయత్నాల్లోకి దివ్య (సారా పాలేకర్) అనే చిన్నారి వస్తుంది. ఆమెను ఉపయోగించుకుని తన సమస్య నుంచి బయటపడాలని మొదట భావించిన సూరి.. క్రమంగా ఆమె చుట్టూ ఉన్న ఓ అసాధారణమైన రహస్యంలో చిక్కుకుంటాడు. దివ్యకు ఉన్న వింత శక్తులు, ఆమె గతం, సూరితో ఆమె ప్రయాణం ఎటు దారి తీసింది? డబ్బు కోసం మొదలైన ఈ ప్రయాణం చివరికి సూరిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అనేదే మిగతా కథ.

విశ్లేషణ:

తెలుగు తెరపై ఫాంటసీ కథలు కొత్తేమీ కాదు.. కానీ మ్యాజిక్, కామెడీ, అడ్వెంచర్‌ను ఒక చిన్నారి చుట్టూ అల్లుకుంటూ.. ఓ స్వార్థపరుడైన మ్యాజిషియన్ జీవితాన్ని మార్చే కథగా చెప్పడం మాత్రం అరుదైన ప్రయత్నమే. ఆ ప్రయత్నమే ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. డబ్బే జీవితంగా భావించే సూరి పాత్రలోనే దర్శకుడు కథకు అసలు బీజం వేశాడు. అతడి జీవితంలోకి దివ్య అనే చిన్నారి రావడం, ఆమెకు ఉన్న అసాధారణ శక్తులు బయటపడటంతో కథ సాధారణ కామెడీ నుంచి ఫాంటసీ అడ్వెంచర్‌గా మారుతుంది.

అయితే కథలోని అసలు ఆకర్షణ కేవలం ఆ మ్యాజికల్ ఎలిమెంట్స్ కాదు.. సూరి, దివ్య మధ్య క్రమంగా ఏర్పడే అనుబంధమే. సినిమాలోని ఫాంటసీ కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉంది. మ్యాజిక్‌ను కేవలం విజువల్ ఎఫెక్ట్‌గా కాకుండా కథను ముందుకు నడిపించే అంశంగా ఉపయోగించడం బాగుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఫాంటసీకి మరింత బలమైన స్క్రీన్‌ప్లే ఉంటే బాగుండనే అనిపిస్తుంది.

చిన్నపిల్లలకు మంచి వీకెండ్ ఛాయిస్..

చిన్నపిల్లలను టార్గెట్ చేస్తూ మ్యాజిక్, ఫాంటసీ, కామెడీ, అడ్వెంచర్‌ను కలిపి తెరకెక్కించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని సాగుతుంది. ముఖ్యంగా సినిమాలో వచ్చే మ్యాజిక్ సీన్స్, వింతైన ఫాంటసీ ఎలిమెంట్స్ పిల్లలకు ఆసక్తిని కలిగిస్తూ.. స్క్రీన్‌పై ఏం జరగబోతుందా అనే క్యూరియాసిటీని పెంచుతాయి. మధ్య మధ్యలో వచ్చే కామెడీ సన్నివేశాలు చిన్నారులతో పాటు పెద్దలను కూడా నవ్వించేలా ఉన్నాయి.

ఇక సూరి, దివ్య మధ్య ఏర్పడే అనుబంధం కథకు మంచి ఎమోషన్‌ను జోడిస్తుంది. ఫాంటసీ, మ్యాజిక్‌తో పిల్లలను ఎంగేజ్ చేస్తూనే.. ఎమోషన్, కామెడీతో తల్లిదండ్రులను కూడా కథలో భాగం చేసే ప్రయత్నం కనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లలు మ్యాజిక్, ఫాంటసీ సన్నివేశాలను ఎంజాయ్ చేస్తుంటే.. పెద్దలు కామెడీ, ఎమోషనల్ సీన్స్‌తో కనెక్ట్ అయ్యేలా సినిమా సాగుతుంది.

నటీనటులు..

ఫహాద్ ఫాజిల్ తన సహజమైన నటనతో సూరి పాత్రను బాగా మోశాడు. కామెడీ, ఎమోషన్, స్వార్థం వంటి భిన్నమైన షేడ్స్‌ను చక్కగా చూపించాడు. సారా పాలేకర్ కూడా దివ్యగా సహజమైన నటనతో మెప్పించింది. వీరిద్దరి కాంబినేషన్ సినిమాకు ప్రధాన బలం. మిగతా వాళ్ళు తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. 

టెక్నికల్‌గా..

శశాంక్ యేలేటి ఎంచుకున్న ఫాంటసీ కాన్సెప్ట్‌ను తెరపై ఆసక్తికరంగా ఆవిష్కరించారు. బ్రాడ్ ఫ్రాన్సిస్ కెమెరా వర్క్ సినిమాకు మంచి విజువల్ ఫీల్ తీసుకొచ్చింది. కాల భైరవ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు మరింత ఇంపాక్ట్ ఇచ్చింది. ఎడిటింగ్ కూడా షార్ప్‌గా ఉండి కథనాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్లింది. మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్‌గా ఉన్నాయి.