అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం - ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్‌నెస్... ఈ పేరు నేడు ఒక ఆధ్యాత్మిక విప్లవానికి పర్యాయపదం కృష్ణ చైతన్యానికి మారుపేరు. హరినామ సంకీర్తన ధ్యేయంగా, శ్రీ చైతన్య మహాప్రభు బోధనల ఆలంబనగా విరాజిల్లుతోంది. హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే...హరే రామ హరే రామ రామ రామ హరే హరే అనే మహామంత్రం భక్తులు నిత్యం వందలు, వేలసార్లు జపిస్తూ ధార్మిక జగత్తులో ఓలలాడుతున్నారు. భౌతిక సుఖాలకు పాకులాడకుండా శాశ్వతమైన గోలోక బృందావనాన్ని చేరుకోవాలని తపిస్తుంటారు. ఏ.సి. భక్తివేదాంత స్వామి ఈ సంస్థ వ్యవస్థాపక ఆచార్యులు. తదనంతరం వీరే శ్రీల ప్రభుపాదులుగా వ్యవహరించారు. ఇస్కాన్ ను భక్తి వేదాంత స్వామి 1966 జులై 13 న న్యూయర్క్ లో ఏర్పాటుచేశారు. అలా ఈ సంస్థ ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తయినాయి. ఇటీవలనే ప్రారంభమైన ఉత్సవాలు ఇంకా జరుగుతున్నాయి. ఇస్కాన్ స్థాపించాక వారు ప్రపంచవ్యాప్తంగా 108 కృష్ణ మందిరాలను నెలకొల్పారు. అందులో భాగంగా మనదేశంలో వారు తన స్వహస్తాలతో మాయాపూర్, కొలకత్తా, బృందావనం, హైదరాబాద్లో ఇస్కాన్ మందిరాలను ప్రతిష్ఠించారు.
కృష్ణ చైతన్యం కోసం కృషి
హైదరాబాద్ ఆబిడ్స్ లోని ఇస్కాన్ - శ్రీ రాధా మదన మోహన మందిరాన్ని 1976 ఆగస్టు 18న ప్రతిష్ఠించారు. అంటే ఈనెల 18తో ఈ మందిరం స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఒకవైపు ఇస్కాన్ ఏర్పడి 60 సంవత్సరాలు, ఇస్కాన్ హైదరాబాద్- ఆబిడ్స్ మందిరం 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభసందర్బంగా వీటి వివరాలు ఒకసారి పరిశీలిద్దాం. భక్తివేదాంత స్వామి కలకత్తా లో 1896 సెప్టెంబర్ 1 న సంప్రదాయ గౌడియ వైష్ణవ కుటుంబంలో జన్మించారు. తల్లి దండ్రులు పెట్టిన పేరు అభయ్. ఉన్నత చదువులు ఒకవైపు, కృష్ణభక్తి మరోవైపు అభయ్ స్వంతం. తన ఆధ్యాత్మిక గురువు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ పాశ్చాత్య దేశాలలో కృష్ణ చైతన్యం ప్రచారం చేయాలని భక్తి వేదాంతస్వామికి ఆదేశం ఇచ్చారు . 1944 లో కలకత్తా నుండి బ్యాక్ టు హెడ్ పత్రికను ప్రారంభించారు. కృష్ణ చైతన్యం కోసం కృషిచేశారు. 1959 లో సన్యాసం స్వీకరించారు. అమెరికా వెళ్లేందుకు 1965 ఆగస్టు 13 న కలకత్తా షిప్ హార్బర్ నుంచిజలదూత అనే షిప్ లో ప్రయాణించి. 37 రోజుల ప్రయాణం తర్వాత సెప్టెంబర్ 19న న్యూయార్క్ చేరుకున్నారు.
భక్తి వేదాంత బుక్ ట్రస్ట్
పెన్సిల్వెనియా రాష్ట్రంలోని బట్లర్ నగరంలో ఉన్న గోపాల్ ఆగర్వాల్ ఇంటికి వెళ్లారు. అనంతరం అనేక ప్రదేశాలలో తిరుగుతూ కృష్ణ చైతన్యం బోధనలు ఇవ్వసాగారు. అమెరికాలో 9 నెలలకు పైగా నిర్విరామంగా కృష్ణ బోధనలు చేస్తూ, చివరకు కొంతమంది కళాకారులూ , సంగీతం తెలిసినవారు, భారత ఆధ్యాత్మికం, కృష్ణచైతన్యం పట్ల విశ్వాసం ఉన్న వ్యక్తుల తోడ్పాటుతో వేదాంతస్వామి తనకంటూ ఒక ఆశ్రయం ఏర్పాటుచేసుకున్నారు. న్యూయార్క్ లోని సెకండ్ అవెన్యూ స్టోర్ ఫ్రంట్లో కృష్ణ చైతన్య ప్రచారం కార్యక్రమాలు, భజనలు, హరినామ సంకీర్తనలు, శ్రీమద్ భగవద్ గీత, భాగవతం, కృష్ణ సంబంధ గ్రంథాలపై ప్రవచనాలు భక్తివేదాంత స్వామి ఇవ్వటం ప్రారంభించారు. ఇక్కడే 1966 జులై 13న ఇస్కాన్ ను స్థాపించారు. పూర్తి స్థాయి సంస్థగా రూపకల్పన చేశారు. భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ ను నెలకొల్పారు. వీరి గ్రంథాలు 95 భాషలలోకి అనువాదం అయినాయి. భగవద్గీత యథాతథం, శ్రీమద్ భాగవతం, శ్రీ చైతన్య చరితామృతం, భక్తి రసామృతం, శ్రీ ఈషోపనిషత్తు, ఉపదేశామృతం, దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు వంటి అనేక సుప్రసిద్ధమైన గ్రంథాలు ఇవి కొన్ని . ఇక శ్రీల ప్రభు పాదులవారు కేవలం 11 సంవత్సరాల వ్యవధి లో 14 సార్లు ప్రపంచాన్ని చుట్టివచ్చారు. తన జీవిత కాలం అంతా కృష్ణ సేవలో, ఆచార్యుల మార్గనిర్దేశంలో గడిపిన శ్రీల ప్రభుపాదులవారు 1977 నవంబర్ 14 న తనువు చాలించారు.
50 ఏండ్ల శ్రీ శ్రీ రాధా మదన మోహన మందిరం
ప్రపంచవ్యాప్తంగా 150 కి పైగా దేశాలలో ఇస్కాన్ - కృష్ణ చైతన్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 900 కు పైగా ఇస్కాన్ - రాధా కృష్ణ మందిరాలు నెలకొల్పబడినాయి. 75 కోట్ల భక్తి గ్రంధాలు ప్రపంచ దేశాలలో అనేక భాషలలో వితరణ చేయటం జరిగింది. 600 కోట్ల ప్లేట్ ల ఉచిత ప్రసాద భోజనాలు పంపిణీ చేశారు.ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 1.2 కోట్ల మంది భక్తులు ఇస్కాన్ ఆలయాలను సందర్శిస్తున్నారు. భారతదేశంలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమం ద్వారా ప్రతిరోజూ సుమారు 30 లక్షల మంది పిల్లలకు భోజనం అందించబడుతోంది. హైదరాబాద్ ఆబిడ్స్ లోని ఇస్కాన్ శ్రీశ్రీ రాధా మదన మోహన మందిరం ఈ నెల 18 వ తేదీతో 50 సంవత్సరాలు పూర్తిచేసుకుని, స్వర్ణత్సవ శోభను సంతరించుకుంది. శ్రీల ప్రభుపాదులు 1976 ఆగస్టు 18 న ఈ మందిరం లో శ్రీ శ్రీ రాధా మదన మోహన, శ్రీ శ్రీ గౌర నితాయి, శ్రీ శ్రీ జగన్నాథ, సుభద్ర, బలదేవ విగ్రహాలను ప్రతిష్ఠించారు. 50 ఏళ్ళ ప్రస్థానాన్ని అత్యంత వైభవంగా ఆలయ కమిటీ నిర్వహిస్తోంది. ఈ సందర్బంగా ఆగస్టు 15 నుంచి 18 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
భక్తియుత నిస్వార్థ సేవ
భార్య, పిల్లలు , కుటుంబ సభ్యులను, భౌతిక సంపదలు వదిలి 70 సంవత్సరాల వయస్సులో రెండుసార్లు గుండెపోటుకు గురైనప్పటికి గురు ఆదేశం శిరసావహించి చెక్కు చెదరని కృష్ణ విశ్వాసంతో నౌకలో ప్రయాణం చేశారు. అమెరికాలో ఏమాత్రం అనుకూలం కాని పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుని అక్కడి వారిని ముఖ్యంగా యువతను కృష్ణచైతన్యంలోకి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. వారి సరళమైన జీవనం, నిస్వార్థ భక్తి సేవ, కార్యదీక్షత, సాధించాలనే పట్టుదల మనకు సదా ఆదర్శనీయమైనవి.
- డి.శ్రీనివాస్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
