- చేసేదేంలేక నీటిని వదులుతున్న అధికారులు
- పూడికతీత పూర్తికాకపోవడమే కారణం
- ఆయకట్టు రైతుల్లో ఆందోళన.
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని ప్రధాన నీటి వనరు కడెం ప్రాజెక్టు కెపాసిటీ ఏడు టీఎంసీలే అయినా.. అందులో నిల్వ ఉండే నీరు మాత్రం మూడున్నర టీఎంసీలే. భారీ స్థాయిలో సిల్ట్ పేరుకుపోవడమే ఇందుకు కారణం. సిల్ట్‌ను తొలగించేందుకు ఏర్పాటు చేసే ప్రాసెసింగ్ యూనిట్ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంటోంది. సిల్ట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఈతర్ అనే కంపెనీ ఏడాది క్రితమే టెండర్ దక్కించుకుంది. 20 ఏండ్ల పాటు కడెం ప్రాజెక్టు నుంచి పూడిక తొలగించేందుకు అగ్రిమెంట్ చేసుకుంది. కానీ పనుల్లో తీవ్ర ఆలస్యం జరుగుతోంది.
18 కి.మీ. పొడవున నిండిన పూడిక
కొద్దిరోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా కడెంలోకి పెద్ద ఎత్తున వరద తరలివచ్చింది. అయితే ఏడు టీఎంసీల సామర్థ్యమున్న ప్రాజెక్టులో గరిష్ట నీటిమట్టాన్ని 3.495 టీఎంసీలుగా చూపుతూ అధికారులు దిగువకు నీటిని వదిలారు. ఒక దశలో ప్రాజెక్టులోకి 1.69 లక్షల క్యూసెక్కులకు వరద రాగా 16 గేట్లను ఎత్తి అదేస్థాయిలో నీటిని గోదావరిలోకి వదిలిపెట్టారు. ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 3.495 టీఎంసీలను మాత్రమే ఉంచుతూ మిగతా నీటినంతా దిగువకు వదిలేస్తున్నారు. ప్రాజెక్ట్ రిజర్వాయర్ ఎగువన దాదాపు 15 నుంచి 18 కిలోమీటర్ల పొడవున పూడిక నిండిపోయినట్లు గతంలో సర్వే నిర్వహించిన అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు సగానికి పైగా నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడంతో 68 వేల ఎకరాల ఆయకట్టుకు వానాకాలం చివర్లో, రబీ సీజన్లో సాగునీరు అందించలేని పరిస్థితులు తలెత్తుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థలాలు గుర్తించినా అప్పగించని అధికారులు
రాజస్థాన్‌కు చెందిన ఈతర్ కంపెనీ కడెం పూడికతీత, ప్రాసెసింగ్ పనులను దక్కించుకుంది. టన్ను పూడిక మట్టికి రూ.407 ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. 20 ఏండ్లపాటు ఈ పనులు నిర్వహించనుంది. 100 ఎకరాల్లో యూనిట్‌ను ఏర్పాటు చేసి.. 20 ఎకరాల్లో ప్రాసెసింగ్ యూనిట్, 80 ఎకరాల్లో సిల్ట్ నుంచి ప్రాసెసింగ్ చేసిన ఇసుక, మట్టి నిల్వలను వేర్వేరుగా స్టాక్ పాయింట్ పేరిట ఉంచనున్నారు. ఇందుకుగాను ప్రాజెక్టు సమీపంలో స్థలం కోసం అన్వేషించిన అధికారులు కడెం మండలంలోని ఎర్వచింతల, రేవోజిపేట, సోమవార్ పేట గ్రామాల లో భూములను గుర్తించారు. కానీ ఈ భూములను ఇప్పటివరకు సంబంధిత కంపెనీకి కేటాయించకపోవడంతో యూనిట్ ఏర్పాటులో జాప్యం
జరుగుతోంది.
పూడిక పనులు వెంటనే చేపట్టాలని మంత్రి ఆదేశం
ఇటీవల కడెం ప్రాజెక్టును సందర్శించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి ప్రాజెక్టులోని నీటి నిల్వ సామర్థ్యం, పూడిక సమస్యను సంబంధిత ఇరిగేషన్ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. పూడిక సమస్యపై కలెక్టర్ మంత్రికి వివరించడంతో వెంటనే పూడికతీత పనులను మొదలుపెట్టాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి ఆదేశాలతోనైనా పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
