న్యూఢిల్లీ: ఇండియా యంగ్ షట్లర్ ఆయుష్ శెట్టి.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సంచలన విజయం సాధించాడు. సోమవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆయుష్ 21–14, 13–21, 21–19తో వరల్డ్ నంబర్‌వన్ షి యు క్వి (చైనా)పై గెలిచాడు. గంటా 13 నిమిషాల మ్యాచ్‌లో రెండో గేమ్ కోల్పోయినా డిసైడర్‌లో అద్భుతంగా ఆడాడు.
యు క్వి నుంచి పోటీ ఎదురైనా వరుస పాయింట్లతో ఆకట్టుకున్నాడు. 20–20 స్కోరు వద్ద రెండు పాయింట్లు నెగ్గి చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక రికార్డు స్థాయిలో ఆరో పతకం వేటలో ఉన్న సింధు.. తొలి రౌండ్‌లో 21–7, 21–11తో సోఫియా నోబుల్ (ఐర్లాండ్)పై అలవోకగా గెలిచింది. 29 నిమిషాల మ్యాచ్‌లో తెలుగమ్మాయి ఆధిపత్యమే నడిచింది.
ఈ టోర్నీలో సింధు ఇప్పటికే ఒక స్వర్ణం (2019), రెండు రజతాలు, రెండు కాంస్యాలు గెలిచింది. మెన్స్ డబుల్స్‌లో హరిహరన్–ఎం. ఆర్. అర్జున్ 21–16, 6–4తో స్కాట్ గుల్డియా–పౌల్ రెనాల్డ్స్ (ఐర్లాండ్)పై, విమెన్స్ డబుల్స్‌లో ట్రీసా జోలీ–గాయత్రి గోపీచంద్ 21–9, 21–13తో పౌలా లోపెజ్–లూసియా రోడ్రిగ్వేజ్ (స్పెయిన్)పై, కవిప్రియ సెల్వం–సిమ్రాన్ సింఘి 22–20, 21–14తో నికోల్ కరుల్లా–కార్మెన్ మరియా జెమినెజ్ (స్పెయిన్)పై, మెన్స్ సింగిల్స్‌లో ఆయుశ్ షెట్టి 21–14, 13–21, 21–19తో షి యు క్వి (చైనా)పై గెలిచారు.
