హుజురాబాద్, వెలుగు: రాజకీయంగా కక్షసాధించేందుకే జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై కేసులు వేసి వేధింపులకు గురిచేస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జర్నలిస్టుల న్యాయమైన హక్కుల పరిరక్షణ కోసం హుజురాబాద్ లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించిన బండ శ్రీనివాస్ జర్నలిస్టులకు సంపూర్ణ సంఘీభావం ప్రకటించి మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలుగా నివేశన స్థలాల కోసం జర్నలిస్టులు అలుపెరగని పోరాటం చేశారని, వారి సంక్షేమాన్ని గుర్తించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా స్థలాలను కేటాయించిందని ఆయన గుర్తుచేశారు.
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన జర్నలిస్టులకు అండగా నిలవాల్సిన అధికార పార్టీ, వారి కలను చిదిమేసే కుట్రలు చేయడం శోచనీయమన్నారు. జర్నలిస్టులకు పూర్తి న్యాయం జరిగేంతవరకు బీఆర్ఎస్ అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, నాయకులు ముత్యం రాజు, తాళ్లపల్లి శ్రీనివాస్, ఎండీ గఫర్, సిర్సపల్లి సర్పంచ్ రామారావు, ఆమ్జద్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొని మద్దతు పలికారు.
