చేర్యాల, వెలుగు : ఫుడ్ పాయిజన్ కారణంగా 19 మంది స్టూడెంట్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరులోని కేజీబీవీలో ఆదివారం రాత్రి జరిగింది. ఆలుకర్రీ, చపాతీ, చికెన్, బగారా రైస్ తిన్న తర్వాత 13 మంది స్టూడెంట్లు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. గమనించిన సిబ్బంది వారిని 108లో చేర్యాల హాస్పిటల్ కు తరలించి ట్రీట్ మెంట్ అందించిన అనంతరం డిశ్చార్జి చేశారు.
సోమవారం ఉదయం మరో ఆరుగురు అస్వస్థతకు గురికావడంతో వారిని సైతం హాస్పిటల్ కు తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. హాస్టల్ లో పారిశుధ్య సమస్యతో పాటు క్వాలిటీ లేని ఆహార పదార్థాలు, కుళ్లిపోయిన పండ్లు ఇస్తుండడం వల్లే స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
స్టూడెంట్ల అస్వస్థత విషయం తెలుసుకున్న సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి సంబంధిత అధికారులతో కలిసి కేజీబీవీని పరిశీలించారు. కేజీబీవీలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శానిటేషన్, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన ఎస్టిమేషన్స్ పంపించాలని సూచించారు. ఆహారం క్వాలిటీ విషయంలో నిర్లక్ష్యంగా వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హాస్పిటల్ లో స్టూడెంట్లను పరామర్శించి, వివరాలు తెలుసుకున్నారు.
