బంగారం రేట్ల పెరగటంతో కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్న గోల్డ్ లవర్స్.. ఏం చేస్తున్నారంటే?

బంగారం రేట్ల పెరగటంతో కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్న గోల్డ్ లవర్స్.. ఏం చేస్తున్నారంటే?

ప్రస్తుతం బంగారం రేట్లలో వస్తున్న స్వల్ప తగ్గుదల రాబోయే పండుగ, పెళ్లిళ్ల సీజన్‌కు ముందు కొనుగోలుదారులకు ఊరటనిస్తోంది. బలమైన ర్యాలీ తర్వాత ప్రాఫిట్ బుకింగ్, అమెరికా వడ్డీ రేట్ల అంచనాలలో మార్పుల కారణంగా బంగారం, వెండి ధరలు కొంత మేర తగ్గాయి. అయితే అంతర్జాతీయ అస్థిత్వం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్ల మద్దతు కారణంగా బంగారానికి డిమాండ్ మాత్రం పటిష్టంగానే ఉందని స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండీ మంగేష్ చౌహాన్ తెలిపారు.

భారతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ, దిగుమతి సుంకాల ప్రభావం వల్ల ధరలు ఇంకా అధికంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం దాదాపు లక్షన్నర రూపాయల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం స్వల్పంగా తగ్గిన రేట్లు షాపింగ్ వాయిదా వేసుకున్న కొనుగోలుదారులను మళ్లీ మార్కెట్‌లోకి తీసుకువస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ.. పండుగ సీజన్‌లో వినియోగదారుల బడ్జెట్, కొనుగోలు శక్తి ఆధారంగా డిమాండ్ స్థిరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు.

అధిక ధరల కారణంగా ప్రజలు బంగారం కొనటాన్ని పూర్తిగా ఆపేయకపోయినా.. వారి షాపింగ్ ట్రెండ్ మాత్రం పూర్తిగా మారుతోంది. బడ్జెట్‌లో పసిడిని దక్కించుకునేందుకు లైట్‌వెయిట్ డిజైన్లు, తక్కువ క్యారెట్ల ఆభరణాలు, పాత బంగారాన్ని మార్చుకోవడం వైపు కొనుగోలుదారులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల వాల్యూమ్ పరంగా కొనుగోళ్లు స్థిరంగా ఉన్నప్పటికీ.. అధిక ధరల కారణంగా సేల్స్ విలువ మాత్రం మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.

ఈ సీజన్ కోసం ఇప్పటికే రిటైలర్లు తమ స్టాక్‌ను రెడీ చేసి పెట్టుకున్నారు. రానున్న దీపావళి, దసరా, పెళ్లిళ్ల సీజన్‌లో ధరలు స్థిరంగా ఉంటే వినియోగదారుల ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. స్వల్పకాలిక ధరల కదలికలు యూఎస్ వడ్డీ రేట్లు, డాలర్, రూపాయి మారకం విలువపై ఆధారపడి ఉంటాయి. గ్లోబల్ పరిణామాలను గమనిస్తూ అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేవారికి ఒకేసారి కాకుండా దశలవారీగా కొనుగోలు చేయడం మంచి పద్ధతి. మార్కెట్ బాటమ్‌ను అంచనా వేయడానికి బదులుగా, పండుగ సీజన్ డిమాండ్, ప్రస్తుత గోల్డ్ రేట్ల కరెక్షన్‌ను ఇన్వెస్టర్లు తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవచ్చు.