అమ్‌స్టెల్విన్ (నెదర్లాండ్స్): మెన్స్ హాకీ వరల్డ్ కప్లో ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం జరిగిన పూల్–డి రెండో మ్యాచ్‌లో ఇండియా 2–4తో ఇంగ్లండ్ చేతిలో పరాజయం చవిచూసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (17వ ని), దిల్‌ప్రీత్ సింగ్ (25వ ని) ఇండియాకు గోల్స్ అందించగా, ఇంగ్లండ్ తరఫున నికోలస్ బండారుక్ (14, 55వ ని), స్టువర్ట్ రష్‌మేర్ (39వ ని), హెన్రీ క్రాఫ్ట్ (43వ ని) గోల్స్ చేశారు.
తొలి మ్యాచ్‌లో వేల్స్‌పై పూర్తి ఆధిపత్యం చూపెట్టిన ఇండియా ఈ మ్యాచ్ తొలి అర్ధభాగంలో దుమ్మురేపింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఫలితంగా 8 నిమిషాల తేడాలో రెండు గోల్స్ కొట్టింది. అయితే రెండో హాఫ్‌లో ఇండియా డిఫెన్స్ ఘోరంగా తేలిపోయింది. ఇంగ్లండ్ స్ట్రయికర్లను ఏమాత్రం అడ్డుకోలేకపోయింది.
దాంతో మూడో క్వార్టర్‌లో ఆధిపత్యం చూపెట్టిన ఇంగ్లండ్ వరుసగా రెండు గోల్స్ కొట్టింది. చివరి క్వార్టర్‌లో మరో గోల్ కొట్టి ఇండియాను దెబ్బతీసింది. బుధవారం జరగనున్న కీలకమైన ఆఖరి పూల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో ఇండియా తలపడనుంది. రెండో రౌండ్‌కు అర్హత సాధించాలంటే ఇండియా ఈ మ్యాచ్‌లో కనీసం డ్రా చేసుకోవడం లేదా గెలవడం తప్పనిసరి. ఓడిపోతే మాత్రం టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది.
