- 24 వరకు మూడు రోజుల పాటు నిర్వహణ
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సహా అనుబంధ క్షేత్రమైన పాతగుట్ట ఆలయంలో ఈ నెల 22 నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 24 వరకు మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఉత్సవాల సందర్భంగా ఈ నెల 23, 24న రెండు రోజుల పాటు ఆర్జిత సేవలైన నిత్య, శాశ్వత కల్యాణాలు, నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవం, లక్షపుష్పార్చన, సుదర్శన నారసింహ హోమం వంటి కైంకర్యాలను తాత్కాలికంగా రద్దు చేశారు.
పవిత్రోత్సవాలు ముగిసిన అనంతరం ఈ నెల 25 నుంచి నిత్య కైంకర్యాలు, ఆర్జిత సేవలు పునఃప్రారంభం అవుతాయని ఈవో భవానీ శంకర్ తెలిపారు. ఏడాది కాలంలో ఆలయంలో నిర్వహించిన పలు రకాల సేవలు, పూజలు, కైంకర్యాలు, ఉత్సవాల్లో తెలిసీతెలియక దొర్లిన పొరపాట్లు, దోషాల నివారణ కోసం పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
