భూదాన్ పోచంపల్లి, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ వ్యక్తి వీరంగం సృష్టించి మహిళా డాక్టర్‌పై దాడి చేశాడు. మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన దుద్యాల వెంకట తిరుపతి కాలికి గాయాలు కావడంతో చికిత్స కోసం పీహెచ్‌సీకి వచ్చాడు. చికిత్స చేయించుకుంటున్న సమయంలో వైద్య సిబ్బందిని దుర్భాషలాడుతూ విచిత్రంగా ప్రవర్తించాడు.
అనంతరం మరో వ్యక్తికి చికిత్స చేస్తున్న డాక్టర్ శ్వేతపై అకస్మాత్తుగా దాడి చేసి చెంపదెబ్బలు కొట్టాడు. అడ్డుకునేందుకు వచ్చిన పేషెంట్లను కూడా కొట్టి, స్టెతస్కోప్‌ను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. సిబ్బంది పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్సైకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తూ నల్ల బ్యాడ్జీలతో ధర్నా నిర్వహించారు. డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ శ్వేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
