సెయింట్ లూయిస్ (అమెరికా): ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద.. సింక్‌ఫీల్డ్ కప్ టోర్నీలో అద్భుతంగా ఆడుతున్నాడు. సోమవారం లెవోన్ అరోనియన్ (అమెరికా)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను 39 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు. దాంతో ఈ రౌండ్ తర్వాత ప్రజ్ఞా మూడున్నర పాయింట్లతో సంయుక్తంగా రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.
మిడిల్ గేమ్‌లో ఇండియన్ ప్లేయర్ రెండు పాన్‌లు కోల్పోయినప్పటికీ అరోనియన్ వ్యూహాలను సమర్థంగా తిప్పికొట్టి గేమ్‌ను డ్రా వైపు తీసుకెళ్లాడు. మాక్సిమ్ వాచిర్ లాగ్రెవ్ (ఫ్రాన్స్, 3.5)తో జరిగిన గేమ్‌ను డ్రా చేసుకున్న వెస్లీ సో (అమెరికా) నాలుగు పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.
ఇతర గేముల్లో అనిష్ గిరి (నెదర్లాండ్స్, 2.5).. జోర్డాన్ వాన్ ఫోరెస్ట్ (నెదర్లాండ్స్, 1)పై గెలవగా.. సెవియన్ శామ్యూల్స్ (అమెరికా, 3).. విన్సెంట్ కీమర్ (జర్మనీ, 3.5), జావోకిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్, 2.5).. ఫ్యాబియానో కరువాన (అమెరికా, 3) మధ్య జరిగిన గేమ్‌లు డ్రా అయ్యాయి.
