నల్గొండ, వెలుగు: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం భూములు కోల్పోయి పదేళ్లు గడుస్తున్నా తమకు ఉద్యోగ భరోసా కల్పించలేదంటూ నిర్వాసిత రైతులు సోమవారం కలెక్టరేట్‌కు ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాంట్ కోసం భూములు త్యాగం చేసి రోడ్డున పడ్డామని కన్నీరుమున్నీరయ్యారు.
పవర్ ప్లాంట్ ఏర్పాటు సమయంలో భూములు కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఉద్యోగాలు కల్పించి ఆదుకుంటామని అధికారులు, పాలకులు హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. కానీ ఆ హామీలు ఇప్పటికీ నెరవేరలేదన్నారు. భూములు కోల్పోయిన వీర్లపాలెం, దుబ్బతండా, సత్ తండా, తల్లావీరప్పగూడెం, నర్సాపురం, తిమ్మాపురం శాంతి నగర్ తూర్పు తండా గ్రామాల్లో రైతుల ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోందన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. పూర్తి విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని మిర్యాలగూడ ఆర్డీవోను కలెక్టర్ ఆదేశించారు.
