సర్ ప్రక్రియ.. తెలంగాణలో ఆ మూడు జిల్లాల్లోనే ఎక్కువ ఓట్లు తొలగింపు

సర్ ప్రక్రియ.. తెలంగాణలో ఆ మూడు జిల్లాల్లోనే ఎక్కువ ఓట్లు తొలగింపు
  • హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో 43 లక్షలకు పైగా తగ్గిన ఓట్లు..  అత్యల్ప తగ్గింపు నమోదైన నియోజకవర్గంగా ఆలేరు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియతో డ్రాఫ్ట్ జాబితాలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గింది. ఈ ఏడాది జూన్ 10న ఇచ్చిన జాబితాతో పోలిస్తే సోమవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 73,39,235 ఓట్లు (21.70 శాతం) తగ్గాయి. రాష్ట్రవ్యాప్తంగా జూన్‌‌లో 3,38,26,448 గా ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్ తరువాత ప్రస్తుతం 2,64,87,213 కు చేరింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌‌గిరి మూడు జిల్లాల్లోనే ఏకంగా 43 లక్షలకు పైగా ఓట్లు తగ్గాయి.

చిరునామా మారడం, మరణించడం, డబుల్​ఓట్లు వంటి కారణాల వల్లే ఈ భారీ తగ్గింపు చోటుచేసుకుందని అధికారులు వెల్లడించారు. ఇక ఈ మూడు జిల్లాల్లో సమాచార లోపాలున్న ‘అనామలీస్’ ఓట్లు 23.69 లక్షల ఓట్లు, 2002 నాటి జాబితాతో అనుసంధానం కాని ‘నో మ్యాపింగ్’ ఓటర్లు 27.17 లక్షలుగా నమోదయ్యాయి. అనామలీస్, నో మ్యాపింగ్ (2002 ఓటర్ల జాబితాతో అనుసంధానం కాకపోవడం) ఓటర్ల జాబితాలో తీవ్ర వ్యత్యాసాలు వెలుగుచూశాయి.

రంగారెడ్డి 11.44 లక్షలు, హైదరాబాద్ 8.95లక్షలు, నిజామాబాద్ 3.92 లక్షలు, మేడ్చల్ మల్కాజ్‌‌గిరి 3.30 లక్షలు, సంగారెడ్డి 2.10 లక్షలు జిల్లాల్లో అత్యధికంగా అనామలీస్ ఓటర్లు నమోదు కాగా నో మ్యాపింగ్ ఓటర్లలో హైదరాబాద్ 18.50 లక్షలు , మేడ్చల్ మల్కాజ్‌‌గిరి 8.45 లక్షలు, సంగారెడ్డి 48 వేలు, నిజామాబాద్ 45 వేలు, మహబూబ్‌‌నగర్ 38 వేలతో టాప్ 5లో ఉన్నాయి.

కనుమరుగైన కార్మిక కాలనీలతో భారీగా తగ్గిన ఓట్లు..

నియోజకవర్గాల వారీగా చూస్తే, హైదరాబాద్ జిల్లాలోని ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 45.17 శాతం ఓట్లు తగ్గాయి. ఇక్కడ 3.10 లక్షల ఓట్లలో ఏకంగా 1.40 లక్షల ఓట్లు డిలీట్ అయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో సనత్‌‌నగర్ 44.93%, మలక్‌‌పేట 44.76%, ఎల్బీనగర్ 44.44%, జూబ్లీహిల్స్ 44.14% నియోజకవర్గాలు ఉన్నాయి. సంఖ్యాపరంగా పరిశీలిస్తే ఐటీ కారిడార్‌‌లోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యంత భారీగా 3,29,828 ఓట్లు పోయాయి.

ఆ తర్వాత కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 2.76 లక్షలు, ఎల్బీనగర్‌‌లో 2.70 లక్షలు, రాజేంద్రనగర్‌‌లో 2.47 లక్షలు, మహేశ్వరంలో 2.35 లక్షల ఓట్లు తగ్గాయి. హైదరాబాద్ నగరంలో పెద్ద సంఖ్యలో అనామలీస్, ఆబ్సెంట్ ఓటర్లు నమోదు కావడానికి గల కారణాలను సీఈవో సుదర్శన్ రెడ్డి వివరించారు. గతంలో హైదరాబాద్ పరిసరాల్లో ఫ్యాక్టరీలు, కార్మిక నివాసాల కోసం ఏర్పాటైన అనేక కాలనీలు ప్రస్తుతం పూర్తిగా కనుమరుగైపోయాయని, పరిశ్రమలు మూతపడటంతో అక్కడి నివాసాలు కూలిపోయి ఖాళీ స్థలాలుగా మారాయని తెలిపారు.  

ఆలేరులో తగ్గింది నాలుగు శాతమే 

అత్యల్ప తగ్గింపు నమోదైన నియోజకవర్గంగా యాదాద్రి జిల్లాలోని ఆలేరు నిలిచింది. ఇక్కడ కేవలం 4.30 శాతం ఓట్లు మాత్రమే తగ్గాయి. గ్రామీణ జిల్లాల్లో ఓటర్ల సంఖ్యలో పెద్దగా హెచ్చుతగ్గులు నమోదు కాలేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యల్పంగా కేవలం 5.68 శాతం 26,121 ఓట్లు మాత్రమే తగ్గాయి. జనగామ 8.32%, మెదక్ 9.48%, సూర్యాపేట 9.55%, మహబూబాబాద్ 9.89% జిల్లాల్లోనూ కోత పది శాతంలోపే పరిమితమైంది.