మొగుళ్లపల్లి/ రేగొండ, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఎల్లారెడ్డిపల్లి, ములకలపల్లి గ్రామాల్లో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఆయన సతీమణి పద్మతో కలిసి నాగదేవత ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ములకలపల్లిలో చేనేత కార్మికుల సూచన మేరకు వారి భవనాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.
అదేవిధంగా రేగొండ మండల పరిధిలోని కోటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే దంపతులు వరుణయాగం నిర్వహించారు. ఆలయ అర్చకుల వేదమంత్రోచ్ఛరణల మధ్య గణపతి పూజతో హోమం చేపట్టారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
