నన్ను విజనరీ, హైటెక్ సీఎం అన్నారు... ఇప్పుడు వాటర్ మ్యాన్ అంటున్నారు: సీఎం చంద్రబాబు

నన్ను విజనరీ, హైటెక్ సీఎం అన్నారు... ఇప్పుడు వాటర్ మ్యాన్ అంటున్నారు: సీఎం చంద్రబాబు

ఐదు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో తనను విజనరీ, సీఈఓ, హైటెక్ సీఎం అన్నారని.. ఇప్పుడు వాటర్ మ్యాన్ గా గుర్తించారని.. ఇది తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని అన్నారు సీఎం చంద్రబాబు. శుక్రవారం ( అక్టోబర్ 2 ) మదనపల్లిలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఈమేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు.

దేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం పడే 2వ జిల్లా అనంతపురంలో ఒకప్పుడు ఎడారి ఛాయలు ఉండేవని అన్నారు చంద్రబాబు. వలసలు ఎక్కువగా ఉండేవని.. పశువులకు మేత ఉండేది కాదని..కూలీలకు ఉపాధి కూడా ఉండేది కాదని అన్నారు. ఆ పరిస్థితులను అధిగమించేందుకు తన రాజకీయ జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేశానని అన్నారు చంద్రబాబు. 

సీమ కష్టాలు తీర్చేందుకు ఎన్టీఆర్ మొదలు పెట్టిన సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నామని... సీమ పరిస్థితులు మార్చేందుకు 30 ఏళ్ల క్రితం డ్రిప్ ఇరిగేషన్ తెచ్చామని... మైక్రో ఇరిగేషన్ పాలసీ తెచ్చాం..జల సంరక్షణకు చర్యలు తీసుకున్నామని అన్నారు చంద్రబాబు.

సీమలో అనేక దేవాలయాలు ఉన్నాయి…కానీ ఆధునిక దేవాలయాలుగా సాగునీటి ప్రాజెక్టులను భావించి పూర్తి చేస్తున్నామని అన్నారు. రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని అన్నారు చంద్రబాబు. హంద్రీనీవా ఫేజ్-2, జీఎన్ఎస్ఎస్, వెలిగొండ ఫేజ్ 2, మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ, భైరవానితిప్ప, మల్లెమడుగు, బాలాజీ సాగర్ వంటి అనేక ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేస్తామని అన్నారు సీఎం చంద్రబాబు.