టోక్యో: జపాన్ వేదికగా జరుగుతోన్న 2026 ఆసియా క్రీడల్లో భారత రెజ్లర్లు, బాక్సర్లు దుమ్మురేపుతున్నారు. రెజ్లింగ్, బాక్సింగ్ విభాగాల్లో శుక్రవారం (అక్టోబర్ 2) 30 నిమిషాల వ్యవధిలోనే భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు లభించాయి. బాక్సింగ్‌లో అంకుష్, పర్వీన్, రెజ్లింగ్‌లో సుజీత్ కల్కల్ ముగ్గురు గోల్డ్ మెడల్స్ సాధించారు. దీంతో ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య 15కు చేరింది. ఓవరాల్‌గా 75 పతకాలతో పాయింట్ల పట్టికలో ఇండియా స్థానానికి చేరుకుంది.
అంకుష్ , పర్వీన్ పసిడి పంచ్
2026 ఆసియా క్రీడల్లో భారత బాక్సర్లు అంకుష్ పంఘల్, పర్వీన్ హూడా పసిడి పంచ్ విసిరారు. శుక్రవారం (అక్టోబర్ 2) జరిగిన ఫైనల్స్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఇద్దరు గోల్డ్ మెడల్స్ సాధించారు. మహిళల 65 కేజీల విభాగంలో చైనీస్ తైపీకి చెందిన చెన్ నిన్ చెన్‌పై పర్వీన్ హూడా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ప్రత్యర్థిపై పంచుల వర్షం కురిపించిన పర్వీన్ 3-2 తేడా పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.
తద్వారా ఆసియా క్రీడల చరిత్రలో బాక్సింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన మూడో భారతీయ మహిళా అథ్లెట్‌గా పర్వీన్ రికార్డ్ సృష్టించింది. పురుషుల 85 కేజీల విభాగంలో పోటీపడ్డ భారత బాక్సర్ అంకుష్ పంఘల్ పసిడి పతకం సాధించాడు. ఫైనల్స్‌లో కొరియా బాక్సర్ ను చిత్తుచిత్తుగా ఓడించాడు. 4-0 తేడాతో ఫైనల్ ను ఏకపక్షం చేసి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
సుజీత్ కల్కల్ పసిడి పట్టు
ఆసియా క్రీడల్లో భారత యువ రెజ్లర్ సుజీత్ కల్కల్ చారిత్రాత్మక విజయం సాధించాడు. వీరోచిత పోరాటంతో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. పురుషుల ఫ్రీస్టైల్ 65 కేజీల ఫైనల్స్‌లో తజికిస్తాన్‌కు చెందిన అబ్దుల్‌మహ్‌జిద్ కుదీవ్తో సుజీత్ పోటీపడ్డాడు. ఈ ఫైనల్ పోరు చివరి వరకు హోరాహోరీగా సాగింది. ఒక దశలో 2-9 పాయింట్లతో వెనుకబడ్డాడు.
దీంతో భారత్ రెజ్లర్ ఓటమి ఖాయం అనుకున్నారు అంతా. కానీ సుజీత్ మాత్రం నిరాశ పడలేదు. ధైర్యంగా పోరాటం కొనసాగించాడు. సెకండ్ రౌండ్‌లో చెలరేగి ఆడుతూ వరుసగా 8 పాయింట్లు సాధించి 10-9 తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుని పసిడి పతకాన్ని సాధించాడు. ప్రస్తుత ఆసియా క్రీడల్లో రెజ్లింగ్ విభాగంలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణ పతకం కావడం విశేషం.
