పండుగ వేళ చక్కెర డీలర్లపై కొరడా.. నిల్వ పరిమితిని తగ్గించిన మోడీ సర్కార్

పండుగ వేళ చక్కెర డీలర్లపై కొరడా.. నిల్వ పరిమితిని తగ్గించిన మోడీ సర్కార్

దేశంలో చక్కెర ధరలను అణచివేసేందుకు, కృత్రిమ కొరతను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం మూడు నెలల వ్యవధిలోనే 3వ సారి చక్కెర స్టాక్ పరిమితులను మరింత కఠినతరం చేసింది. రాబోయే పండుగ సీజన్‌లో చక్కెర ధరలు పెరగకుండా, మార్కెట్లో సరఫరా సజావుగా సాగేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

దేశవ్యాప్తంగా ఉన్న చక్కెర డీలర్లు ఇకపై గరిష్టంగా కేవలం 1,000 క్వింటాళ్ల చక్కెరను మాత్రమే నిల్వ ఉంచుకోవడానికి అనుమతి ఉంటుంది. ఇప్పటివరకు ఈ పరిమితి 2,000 క్వింటాళ్లుగా ఉండేది. అంతేకాకుండా నిల్వ ఉంచే గడువును 30 రోజుల నుంచి కేవలం 15 రోజులకు కుదించారు. అంటే స్టాక్ అందిన 15 రోజుల్లోగా దానిని మార్కెట్లోకి తరలించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30, 2026 వరకు అమల్లో ఉంటాయి. అయితే కోల్‌కతా.. దాని చుట్టుపక్కల ప్రాంతాలు, అసాంలోని డీలర్లకు మాత్రం 2,000 క్వింటాళ్ల వరకు మినహాయింపు ఇచ్చారు.

గత కొద్ది నెలలుగా కేంద్రం క్రమంగా డీలర్ల నిల్వలపై ఆంక్షలు విధిస్తూ వస్తోంది. ఆగస్టు 1న తొలిసారిగా స్టాక్ పరిమితిని 4,000 క్వింటాళ్లుగా పెట్టి, 30 రోజుల గడువు ఇచ్చారు. ఆ తర్వాత సెప్టెంబర్ 15న దానిని 2,000 క్వింటాళ్లకు తగ్గించారు. ఇప్పుడు పండుగ సీజన్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని దానిని ఏకంగా 1,000 క్వింటాళ్లకు కుదించింది. హోర్డింగ్, అక్రమంగా రేట్లు పెంచే ప్రయత్నాలను అడ్డుకోవడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.

Also Read : ఎల్‌నినో దెబ్బకు కోడిగుడ్లు, చికెన్ రేట్లకు రెక్కలు..

దేశంలో చక్కెర ఉత్పత్తి అంచనాలు తగ్గడం, జూలై-ఆగస్టు నెలల్లో రిటైల్ మార్కెట్లో ధరలు పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ప్రభుత్వం తన వార్షిక చక్కెర ఉత్పత్తి అంచనాను 343 లక్షల టన్నుల నుంచి 306 లక్షల టన్నులకు సవరించింది. అదే సమయంలో ముందస్తు జాగ్రత్త చర్యగా 10 లక్షల టన్నుల డ్యూటీ-ఫ్రీ రా షుగర్ దిగుమతులకు కూడా అనుమతిచ్చింది. ఆగస్టులో రిటైల్ మార్కెట్లో కిలో ధర రూ. 65 వరకు వెళ్లగా, ప్రభుత్వ చర్యల కారణంగా అది ప్రస్తుతం రూ.58.50కి దిగివచ్చింది.

కొత్త క్రషింగ్ సీజన్ ప్రారంభమవుతున్న వేళ మార్కెట్లోకి కొత్త సరుకు వచ్చే వరకు స్టాక్ రూల్స్ అమల్లో ఉంటాయి. ప్రభుత్వ తాజా చర్యలతో డీలర్లు తమ నిల్వలను వేగంగా మార్కెట్లోకి వదలాల్సి వస్తుంది. దీనివల్ల పండుగ సమయంలో సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందుబాటు ధరల్లో చక్కెర లభించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.