'కోర్ట్' సినిమాతో నటుడిగా కుర్రకారును మెప్పించిన హర్ష్ రోషన్ (Harsh Roshan) ప్రధాన పాత్రలో, గ్లామరస్ బ్యూటీ నక్షత్ర (Bogapathi Nakshatra) హీరోయిన్‌గా పరిచయమైన క్రేజీ ప్రాజెక్ట్ 'తెల్లకాగితం'. రమేశ్ బండ్రెడ్డి దర్శకత్వంలో, అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మించిన ఈ యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ డ్రామా ఈ రోజు ( అక్టోబర్ 2, 2026 ) గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చింది. టీనేజ్ వయసులో ఊహించని తప్పుల వల్ల ఒక తెల్లటి జీవితం ఎలా కలుషితమవుతుందో తెలిపే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి టాక్ తెచ్చుకుందో చూద్దాం..
కథేంటంటే..?
ఇది భీమవరం బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ . రాము (హర్ష్ రోషన్) అనే కుర్రాడు తన అన్న, వదినల దగ్గర పెరుగుతుంటాడు. స్కూల్ డేస్‌లోనే మధ్యాహ్నం లంచ్ బాక్స్‌లు మారడం అనే చిన్న కారణంతో ఆశ (నక్షత్ర)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ అమాయకత్వపు పరిచయం కాస్తా క్రమంగాప్రేమగా మారుతుంది. అయితే, వయసుకు తగిన పరిణతి లేకపోవడం, హార్మోన్ల ప్రభావంతో వారిద్దరూ శారీరకంగా దగ్గరవుతారు. దానికి ఫలితంగా ఆశ గర్భవతి అవుతుంది. ఇది వారి జీవితాలను ఊహించని మలుపులోకి నెట్టేస్తాయి. చిన్నతనంలో చేసిన ఆ ఒక్క తప్పు వారి జీవితాల్లో ఎలాంటి తుఫాను రేపింది? ఎదురైన అగ్నిపరీక్షను ఆ టీనేజ్ జంట ఎలా ఎదుర్కొంది? తల్లిదండ్రులకు నిజం చెప్పారా లేదా? అనేదే ఈ చిత్ర అసలు కథ.
ఎలా ఉందంటే?
ఫస్ట్ హాఫ్ అంతా గోదావరి జిల్లా పల్లెటూరి నేటివిటీతో, మార్క్ కామెడీతో చాలా కలర్‌ఫుల్ అండ్ ఫన్నీగా సాగిపోతుంది. ముఖ్యంగా హర్ష్ రోషన్, నక్షత్రల మధ్య కెమిస్ట్రీ, రాజ్ కసిరెడ్డి కామెడీ టైమింగ్ థియేటర్‌లో నవ్వులు పూయిస్తాయి. ఇక సెకండాఫ్‌కి వచ్చేసరికి కథ ఊహించని సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కండోమ్, అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ, అబార్షన్ వంటి సున్నితమైన అంశాలను ఎక్కడా అసభ్యత లేకుండా చాలా పరిణతితో చూపించారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ సమాజానికి అవసరమైనదే. టీనేజ్‌లో వచ్చే శారీరక, మానసిక మార్పులు, ఆకర్షణ, సేఫ్టీ వంటి సున్నితమైన అంశాలను అసభ్యతకు తావులేకుండా అవగాహన కోణంలో చూపించే ప్రయత్నం చేశారు.
ప్లస్ .. మైనస్ ఇవే..
అయితే ఫస్ట్ హాఫ్ ఇచ్చిన ఆసక్తిని రెండో భాగం పూర్తిగా కొనసాగించలేకపోయింది. ఇలాంటి కథల్లో తరచుగా కనిపించే .. యూత్ తప్పుదారి– చివర్లో మెసేజ్ ఫార్ములానే ఇక్కడ కూడా కనిపిస్తుంది. దీంతో కొన్ని పరిణామాలు ముందే ఊహించేలా ఉంటాయి. కథనం నెమ్మదించడం, కొన్ని రిపీటెడ్ సీన్లు రావడం సినిమాకు మైనస్ గా నిలిచాయి..
కానీ , క్లైమాక్స్‌కు ముందు వచ్చే కొన్ని కీలక సన్నివేశాలు కథ ఉద్దేశాన్ని బలంగా చెప్పాయి. ముఖ్యంగా పిల్లలు సమస్యలో చిక్కుకున్నప్పుడు భయంతో దాచిపెట్టడం కాకుండా తల్లిదండ్రులను నమ్మి నిజం చెప్పాలనే సందేశం ఆకట్టుకుంటుంది. పిల్లలతో తల్లిదండ్రులు ఓపికగా మాట్లాడాల్సిన అవసరాన్ని కూడా సినిమా గుర్తు చేస్తుంది.
ఎవరెవరు ఎలా చేశారంటే?
హర్ష్ రోషన్ భయపడే ప్రేమికుడిగా, పశ్చాత్తాపపడే కుర్రాడిగా అద్భుతమైన నటన కనబరిచాడు. నక్షత్ర తన డెబ్యూ ఫిలింతోనే ప్రామిసింగ్ లుక్స్ అండ్ నటనతో ఆకట్టుకుంది. అజయ్, శరణ్య ప్రదీప్ తమ రోల్స్‌లో జీవించేశారు. విజయ్ బుల్గానిన్ సంగీతం సినిమాకు మంచి బలం. 'చిలక' పాట వినసొంపుగా ఉండటంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీలక సన్నివేశాల్లో ఇంపాక్ట్ పెంచింది. కె.వి. గుహన్ సినిమాటోగ్రఫీ భీమవరం గ్రామీణ వాతావరణాన్ని అందంగా చూపించింది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కత్తెర పడాల్సింది.
చివరిగా.. ఈ 'తెల్లకాగితం' చిత్రం ఒక సాధారణ టీనేజ్ లవ్ స్టోరీగా మొదలై.. బాధ్యత, తల్లిదండ్రుల పాత్ర, పిల్లల నిర్ణయాల ప్రభావం వంటి అంశాల వైపు వెళ్లే సామాజిక కథ. పిల్లలు తప్పు చేసినప్పుడు భయపడి పక్కదారి పట్టడం కంటే, తల్లిదండ్రులకు నిజం చెప్పడమే శ్రేయస్కరమని ఈ చిత్రం గట్టిగా చెబుతుంది. యూత్‌కి వినోదాన్ని అందిస్తూనే, పేరెంట్స్‌కి ఒక ఐ-ఓపెనర్‌గా నిలిచేలా ఉన్న 'తెల్లకాగితం' ఈ వారం మిస్ కాకుండా చూడాల్సిన ఒక పర్ఫెక్ట్ సోషల్ అవేర్‌నెస్ డ్రామా..
