కొత్తగూడ, వెలుగు: బీఆర్ఎస్ ధర్నాలను ప్రజలు విశ్వసించరని మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో పర్యటించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన మండల స్థాయి ప్రజావాణిని ప్రారంభించి వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆఫీసర్లను అదేశించారు. కొత్తగూడ, మోకాళ్లపల్లిలో కుమురం భీం ఆదివాసీ భవన్ లకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ఆఫీస్ లో గ్రామ కమిటీల అభినందన సభలో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్‌పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన కుటుంబంపై వ్యక్తిగత కక్ష్యతో కేటీఆర్‌ను అడ్డుపెట్టుకొని ఓ వ్యక్తి ఎక్కడి నుంచో ములుగుకు వచ్చి తనపై, తన ఫ్యామిలీపై అసత్య ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. తన గురించి, తన కుటుంబం గురించి ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను కార్యకర్తలు, లీడర్లు తిప్పకొట్టాలని కోరారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2017లో తెచ్చిన జీవో కారణంగానే కోర్టులో కేసు ఉందన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏనాడు కల్యాణలక్ష్మిని ఆపలేదన్నారు. పదేళ్ల నుంచి చేయని అభివృద్దిని ఇప్పుడు చేస్తుంటే చూసి ఓర్చుకోలేక ధర్నాలు చేస్తూ డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. నేతలు బానోత్ రూప్సింగ్, సుంకరబోయిన మొగిలి, వజ్జ సారయ్య, చల్లా నారాయణ రెడ్డి, వజ్జ బాలరాజు, ఇర్ప రాజేశ్వర్‌రావు, పుష్పలత పాల్గొన్నారు.
