శివ్వంపేట, వెలుగు : ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నవాపేట గ్రామానికి చెందిన ఎండీ మహబూబ్ బేగ్(85) సోమవారం ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశాడు. మండల ఆఫీస్లో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో ఎంపీడీవో వెంకటలక్ష్మిని కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు.
మహబూబ్ కు ఎనిమిది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉండగా.. అందరికీ పెండ్లిళ్లు అయ్యాయి. కష్టపడి ఇల్లు, మూడు ఎకరాల భూమి సంపాదించాడు. ఏడుగురు కొడుకులు హైదరాబాద్లో ఉంటుండగా, పెద్ద కొడుకు గ్రామంలో వేరుగా ఉంటాడు. కొన్నేండ్ల కింద భార్య చనిపోవడంతో మహబూబ్ ఒంటరిగా ఉంటూ ఇంటింటికీ తిరుగుతూ భిక్షాటన చేస్తూ కడుపు నింపుకుంటున్నాడు.
వారం రోజుల కింద శివ్వంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కొడుకులకు సమాచారం ఇచ్చినా వారు రాకపోవడంతో మూడు రోజులుగా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పడుకున్నాడు. కొడుకులు రాకపోవడంతో పోలీసులు సర్పంచ్ కు ఫోన్ చేయగా.. ఆయన వచ్చి వృద్ధుడిని తీసుకెళ్లాడు. వృద్ధుడు సోమవారం ఎంపీడీవో ఆఫీస్ కు వచ్చి వినతిపత్రం అందజేసి తన గోడు చెప్పుకొని బోరున విలపించాడు.
