హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్ డిమాండ్ చేశారు. సోమవారం నాంపల్లి టీఎన్జీవో భవన్ లో రాష్ర్ట కార్యవర్గ సమావేశం జరిగింది. దీనికి 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, హైదరాబాద్ సిటీ, జిల్లా నేతలు అటెండయ్యారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, వారి హక్కులను పరిరక్షించే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది. అలాగే ఉద్యోగులకు సంబంధించిన వివిధ శాఖల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది.
సమావేశంలో సమస్యలపై పలు తీర్మానాలు చేసినట్లు జగదీశ్వర్, ముజీబ్ తెలిపారు. ఈ కాపీని త్వరలో సీఎం, డిప్యూటీ సీఎం, సీఎస్ లకు అందచేస్తామని వెల్లడించారు. హెల్త్ కార్డ్స్ అమలులో లోపాలను సవరించి పకడ్బందీగా అమలయ్యేట్లు చూడాలన్నారు. నారాయణ పేట, ములుగు జిల్లాలకు అన్ని జిల్లాలతో సమానంగా కేడర్ స్ర్టెంత్ ను మంజూరు చేయాలన్నారు. సెక్రటేరియెట్ లో అర్హులైన హెచ్‌టీడీ ఉద్యోగులకు 12.5 శాతం కోటాను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.భాగ్యనగర్ టీఎన్జీవో ల్యాండ్ సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ తీర్మానాలను రాష్ర్ట కార్యవర్గం ఆమోదించిందని జగదీశ్వర్, ముజీబ్ తెలిపారు. సమావేశంలో కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యానారయణ గౌడ్, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.
