- లక్నోలో విద్యార్థినుల ఆందోళన
- గెస్ట్ టీచర్లను నియమిస్తామని మంత్రి హామీ
లక్నో: టీచర్ల కొరత, స్కూళ్లలో సమస్యలతో చదువులు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జెన్ ఆల్ఫా(2010–2024) స్టూడెంట్లు రోడ్డెక్కారు. జై ప్రకాశ్ నారాయణ్ సర్వోదయ విద్యాలయానికి చెందిన స్టూడెంట్లు బుద్ధేశ్వర్-మోహన్ రోడ్డుపై, దుబగ్గ-కాన్పూర్ బైపాస్, బాలాగంజ్ కూడళ్ల వద్ద నిరసన చేపట్టారు. భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. స్కూల్‌లో మొత్తం 20 టీచర్ పోస్టులు ఉండగా 8 మంది మాత్రమే ఉన్నారని, 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యార్థులు తెలిపారు.
టీచర్లు లేకపోవడంతో చదువులు దెబ్బతింటున్నాయని, ముఖ్యంగా బోర్డు పరీక్షలకు ప్రిపేర్ కాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ క్లాసులు కూడా సరిగా జరగడం లేదని చెప్పారు. స్కూల్ పనివేళలు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటాయని, ఇందులో దాదాపు రెండు గంటలు అసెంబ్లీకే పోతున్నదని తెలిపారు. దీంతో చదువులకు సమయం తగ్గుతోందని తెలిపారు. ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
మూడు రోజుల కిందే బాయ్స్ ఆందోళన
ఇదే స్కూల్‌కు చెందిన బాయ్స్ ఆగస్టు 14న కూడా టీచర్ల కొరతపై ఆందోళన చేశారు. తాజాగా సోమవారం బాలికలు రోడ్డెక్కారు. ప్లకార్డులు, బ్యానర్లతో నిరసన చేపట్టి రోడ్డును దిగ్బంధించారు. వర్షంలోనూ రోడ్డుపై కూర్చున్నారు. పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న యూపీ సామాజిక సంక్షేమ శాఖ మంత్రి అసిమ్ అరుణ్ నిరసనను గమనించారు. ఈ స్కూల్ నిర్వహణ బాధ్యతలు ఆయన శాఖ పరిధిలోనే ఉన్నాయి. నిరసన చేస్తున్న విద్యార్థుల వద్దకు వెళ్లి మాట్లాడారు.
విద్యార్థులతో కలిసి స్కూల్‌కు వెళ్లిన మంత్రి.. అధికారులు, టీచర్లతో దాదాపు రెండు గంటలు చర్చించారు. టీచర్ల నియామకాలపై కోర్టులో కేసు ఉండటంతో కొందరు పోస్టుల్లో చేరలేకపోయారని చెప్పారు. ఖాళీలను భర్తీ చేసే వరకు గెస్ట్ టీచర్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్య, మౌలిక వసతుల సమస్యలపై యూపీలోని ఫతేపూర్, హమీర్‌పూర్, కన్నౌజ్ ప్రాంతాల్లోనూ స్టూడెంట్లు ఇటీవల ఆందోళనలు చేశారు. లక్నో విద్యార్థుల తాజా నిరసన యూపీ ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో సిబ్బంది, వసతుల సమస్యలను వెలుగులోకి తెస్తోంది.
