పెట్టుబడులు, ప్రాజెక్టులన్నీ ఒకే రాష్ట్రానికేనా?..గుజరాత్ కేంద్రీకృత అభివృద్ధిని ప్రశ్నించిన అన్నామలై 

పెట్టుబడులు, ప్రాజెక్టులన్నీ ఒకే రాష్ట్రానికేనా?..గుజరాత్ కేంద్రీకృత అభివృద్ధిని ప్రశ్నించిన అన్నామలై 

చెన్నై: కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి విధానం కేవలం గుజరాత్‌పైనే దృష్టి సారించేలా ఉందంటూ తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, ‘వీ ది లీడర్స్’ వ్యవస్థాపకుడు కె.అన్నామలై విమర్శించారు. దేశంలోని ప్రధాన పెట్టుబడులు, కీలక సాంకేతిక ప్రాజెక్టులు, అంతర్జాతీయ క్రీడా వేడుకలన్నీ ఒకే రాష్ట్రానికి కేటాయించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. చెన్నైలో జరిగిన ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో అన్నామలై మాట్లాడారు. బీజేపీ నిర్ణయాలు రానురాను ఢిల్లీ కేంద్రీకృతంగా మారుతున్నాయని, ఇది విచారకరమని పేర్కొన్నారు.

రాష్ట్ర స్థాయి నాయకులకు మరింత స్వేచ్ఛ, నిర్ణయాధికారాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘గుజరాత్ మోడల్ మారాలి. ఏఐ కంపెనీలు, సెమీ కండక్టర్ వేఫర్ సంస్థలు, 2020 కామన్‌వెల్త్ గేమ్స్, 2030 పోలీస్ గేమ్స్, 2036 ఒలింపిక్ గేమ్స్ ఇలా అన్నింటిని గుజరాత్‌కు తీసుకెళ్తే ఎలా? భారత్ సమగ్ర అభివృద్ధి అంటే ఒకే రాష్ట్రానికి అవకాశాలు పరిమితం చేయడం కాదు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు” అని అన్నామలై వ్యాఖ్యానించారు.

ప్రాజెక్టులపై రాజకీయ వివాదాలు

మహారాష్ట్రలో ఏర్పాటు కావాల్సిన వేదాంత- ఫాక్స్‌కాన్ సెమీకండక్టర్ ప్రాజెక్టు గుజరాత్‌కు మారడంపై పెద్దఎత్తున రాజకీయ దుమారం రేగింది. అలాగే, టాటా-ఎయిర్‌బస్ విమాన తయారీ ప్రాజెక్టు వడోదరకు వెళ్లడం, ఐపీఎల్ మ్యాచ్‌ను కోల్‌కతా నుంచి అహ్మదాబాద్‌కు మార్చడం వంటి నిర్ణయాలు తీవ్ర వివాదస్పదమయ్యాయి.