- స్మృతి ఇరానీకి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి
- రాంమాధవ్, పురందేశ్వరికి జాతీయ ఉపాధ్యక్ష బాధ్యతలు
- పీయూష్ గోయల్‌కు జాతీయ కోశాధికారి పదవి
- 23 రాష్ట్రాలు, యూటీలకు ప్రాతినిధ్యం.. ఈశాన్యానికి ప్రత్యేక ప్రాధాన్యం
న్యూఢిల్లీ: బీజేపీ కొత్త టీమ్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సోమవారం ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సంస్థాగత మార్పులు చేశారు. మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆర్‌ఎస్‌ఎస్ మాజీ నేత రాంమాధవ్‌కు జాతీయ ఉపాధ్యక్ష పదవులు ఇచ్చారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను జాతీయ కోశాధికారిగా నియమించారు. అలాగే ఏపీకి చెందిన పురందేశ్వరికి పార్టీ ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు.
51 మంది కొత్తవారే
పార్టీ ప్రకటించిన 65 మంది పదాధికారుల్లో 51 మంది కొత్తవారే ఉన్నారు. 13 మంది జాతీయ ఉపాధ్యక్షులు, ఎనిమిది మంది ప్రధాన కార్యదర్శులు, 16 మంది జాతీయ కార్యదర్శులు ఉన్నారు. గత టీమ్‌లో 11 మంది ఉపాధ్యక్షులు, ఏడుగురు ప్రధాన కార్యదర్శులు, 11 మంది కార్యదర్శులు ఉన్నారు. కొత్త టీమ్‌లో ఆరుగురు 40 ఏళ్లలోపు, 15 మంది 40-–49 ఏళ్ల మధ్య వయస్కులు ఉన్నారు. 10 మంది మహిళలకు చోటు దక్కింది. ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు వసుంధరా రాజే సింధియా, తీరథ్ సింగ్ రావత్, బిప్లబ్ కుమార్ దేవ్‌లకు కీలక పదవులు ఇచ్చారు.
లోక్‌సభ, రాజ్యసభలకు చెందిన 18 మంది ప్రస్తుత ఎంపీలకు కూడా అవకాశం కల్పించారు. రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే, బైజయంత్ పాండా, రేఖా వర్మ, తారిఖ్ మన్సూర్‌లను ఉపాధ్యక్షులుగా కొనసాగించారు. వినోద్ తావ్డే, సునీల్ బన్సల్‌ను ప్రధాన కార్యదర్శులుగా కొనసాగించారు.
సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా బి.ఎల్.సంతోష్ కూడా కొనసాగనున్నారు. సతీశ్ పూనియా, గజేంద్ర పటేల్, సంజయ్ భాటియా, హరీశ్ ద్వివేది, ఏపీకి చెందిన దగ్గుబాటి పురందేశ్వరి తదితరులకు కొత్త బాధ్యతలు ఇచ్చారు.
మహిళలకు అవకాశం.. సామాజిక సమతూకం
కొత్త టీమ్‌లో మహిళలకు ప్రాధాన్యం కల్పించారు. జాతీయ ఉపాధ్యక్షులుగా ఆరుగురికి, జాతీయ కార్యదర్శులుగా ముగ్గురికి, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఒకరికి అవకాశం దక్కింది. 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చారు. కాగా, ఐటీ విభాగం చీఫ్‌గా అమిత్ మాలవీయను తొలగించి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దీపక్ మాస్కేను నియమించింది.
