హైదరాబాద్, వెలుగు: నాగుల పంచమి పేరుతో పాములను పట్టుకుని హింసించేవారు, పాములను బంధించి ఆడించేవారిపై అటవీశాఖ నిఘా పెట్టి 17 నాగుపాములను రక్షించింది. పాముల అక్రమ రవాణాను అడ్డుకోవడంతోపాటు మూఢనమ్మకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పీసీసీఎఫ్ వినయ్ కుమార్ ఆదేశాలతో హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో అటవీశాఖ, యాంటీ పోచింగ్ స్క్వాడ్లు, స్థానిక సిబ్బందితోపాటు ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ’కి చెందిన 25 మంది ప్రతినిధులతో మొత్తం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సోమవారం వీరంతా ప్రధాన ఆలయాలు, మార్కెట్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
పాములాడించేవారి నుంచి రక్షించిన పాములకు చికిత్స అందించి, సురక్షితంగా అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టారు. ఈ సందర్భంగా పీసీసీఎఫ్ వినయ్‌కుమార్ మాట్లాడారు. శాస్త్రీయంగా పాములు క్షీరదాలు కావని, పాలను జీర్ణించుకోలేవని, బలవంతంగా పాలు తాగించడం వల్ల వాటికీ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. బతికున్న పాములకు పాలు పోసి ప్రాణాలు తీయడం కంటే, పాముల ప్రతిమలకు పూజలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం పాములు రక్షిత జీవులని, వాటిని పట్టుకోవడం, చిత్రహింసలకు గురిచేయడం, అక్రమంగా తరలించడం నాన్-బెయిలబుల్ నేరమని హెచ్చరించారు.
