- నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు తరలింపు
- నాంపల్లిలోని కూలీలు, క్యాటరింగ్ సిబ్బందికి గంజాయి సప్లయ్
హైదరాబాద్, వెలుగు: ఆటో స్పీకర్ సౌండ్ బాక్స్‌లో గంజాయి తరలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను ఈగల్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా సోమవారం పేట్ బషీరాబాద్ పోలీసులు వీరిని పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 6 కిలోల గంజాయి, ఒక ఆటో, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈగల్ ఫోర్స్ అధికారుల వివరాల ప్రకారం.. పేట్ బషీరాబాద్‌లోని జీకేవీ ఈఎంఆర్‌ఐ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక ఆటోను అడ్డుకున్నారు.
ఆటోలోని స్పీకర్ సౌండ్ బాక్స్‌లో గంజాయి ప్యాకెట్లు దాచి ఉంచినట్లు గుర్తించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు మహ్మద్ హమీద్ మూడు నెలల క్రితం నాగ్‌పూర్‌లోని షేక్ సాదిక్ అనే వ్యక్తి వద్ద రెండు కిలోల గంజాయిని రూ.36 వేలకే కొనుగోలు చేశాడు. ఆ గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా మార్చి నాంపల్లి రైల్వే స్టేషన్, నాంపల్లి దర్గా, పబ్లిక్ గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లోని ఆటో డ్రైవర్లు, రోజువారీ కూలీలు, క్యాటరింగ్ సిబ్బందికి విక్రయించేవారు. ఇప్పటివరకు హమీద్ వద్ద గంజాయి కొనుగోలు చేసిన 25 మందికి పైగా రెగ్యులర్ కస్టమర్ల వివరాలను అధికారులు సేకరించారు.
