- దేవుడి దర్శనానికి వెళ్లినా సీఎంకు తప్పుగా కనిపిస్తోంది: హరీశ్‌రావు
- 22ఏతో జనం భయంభయంగా బతుకుతున్నారు
- ఎయిర్‌పోర్ట్, ఔటర్‌రింగ్ రోడ్డు, చివరకు సీఎం ఇల్లు కూడా నిషేధిత జాబితాలో ఉంటదా? అని ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: తాను దేవుడి దర్శనానికి వెళ్లినా సీఎం రేవంత్‌రెడ్డికి తప్పుగా కనిపిస్తోందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. దేవుడు కనపడితే భక్తితో దండం పెట్టుకోవడం తనకు మొదటి నుంచీ ఉన్న అలవాటని.. కానీ, దేవుడి పేరుతో కూడా రాజకీయం చేయడం ఒక్క రేవంత్ రెడ్డికే తెలిసిన విద్య అని ఆయన విమర్శించారు. సోమవారం ఆయన తెలంగాణభవన్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. “నేను ఆధ్యాత్మిక భావనతో తమిళనాడులోని తిరుచ్చిలో ఉన్న శ్రీ రంగనాథస్వామి దేవాలయానికి వెళ్లాను. కర్నాటకలోని కొల్లూరు మూకాంబికా అమ్మవారి టెంపుల్‌కు వెళ్లడం కోసం శివమొగ్గ ఎయిర్‌పోర్టుకు వెళ్లాను.
దేవుడి దర్శనం కోసం నేను గుడికి వెళ్లడం కూడా ముఖ్యమంత్రికి తప్పుగా కనిపిస్తోందా? నేను అక్కడ ఏవో పూజలు చేసినట్టు ఆరోపిస్తున్నారు. నేను నిజంగా అలాంటి పూజలు చేసినట్టు సీఎం దగ్గర ఆధారాలు ఉంటే తక్షణమే బయటపెట్టాలని సవాల్ విసురుతున్నా. కేవలం నా మీద బురదజల్లి, నా వ్యక్తిగత ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలనే కుట్రతోనే ఈ పూజల డ్రామా ఆడుతున్నారు. సీఎంకు నిజంగా దమ్ముంటే నా పేరు చెప్పి ఈ ఆరోపణలు చేయాలి. రేవంత్ రెడ్డి నా పేరు చెబితే.. వెంటనే లీగల్ నోటీసు పంపుదామని నేను రెడీగా ఉన్నాను. ఆ లీగల్ నోటీసులకు, చట్టానికి భయపడే ఆయన నా పేరు చెప్పకుండా పరోక్షంగా పిరికివాడిలా మాట్లాడుతున్నాడు. నన్ను అగ్గిపెట్టెతో పోలుస్తూ చిల్లర మాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి.. అసలు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే నైతిక అర్హతే లేదు” అని హరీశ్విమర్శించారు.
ప్రజల్లో 22ఏ సెక్షన్ భయం
రాష్ట్రంలో 22ఏ సెక్షన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా భూములను నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను తీవ్ర గందరగోళానికి, అయోమయానికి గురిచేస్తోందని హరీశ్ రావు విమర్శించారు. ఎవరి భూమి 22ఏలో ఉందో, ఎవరిది లేదో తెలియక రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయాందోళనలో బతుకుతున్నారని పేర్కొన్నారు. ఏకంగా ఎయిర్‌పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు లాంటి ప్రభుత్వ భూములను కూడా 22ఏ నిషేధిత జాబితాలో పెట్టారంటే అధికారుల పనితీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. చివరికి సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కూడా 22ఏ ప్రొహిబిషన్ లిస్ట్‌లో ఉందంటే ఆశ్చర్యం కలుగుతోందని, తన సొంత ఇంటికి సెగ తగిలే సరికి ప్రభుత్వంలో హడావిడి మొదలైందని ఎద్దేవా చేశారు. ‘హైదరాబాద్ నగరంలో లక్షలాది ప్రాపర్టీలను రాత్రికి రాత్రి ప్రొహిబిషన్ లిస్ట్‌లో చేర్చారు. తమ ప్రాపర్టీ 22ఏలో ఉందన్న విషయం చాలామంది సామాన్యులకు తెలియడం లేదు. తీరా రిజిస్ట్రేషన్ కోసం చలాన్లు కట్టి, డబ్బులు చెల్లించిన తర్వాత.. చివర్లో మీ భూమి 22ఏలో ఉందని చెప్పి రిజిస్ట్రేషన్ ఆపేస్తున్నారు. పైగా రిజిస్ట్రేషన్ కోసం కట్టిన చలాన్ డబ్బులు కూడా వాపస్ ఇవ్వకుండా ప్రభుత్వం ప్రజల సొమ్మును నిలువునా దోచుకుంటోంది’ అని ఆరోపించారు. తప్పు జరిగినప్పుడు తక్షణమే ఆ భూములను 22ఏ నుంచి తొలగించాలి కానీ.. ఈ రివ్యూల పేరుతో కాలయాపన చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? కమీషన్ల కోసమేనా అని ప్రశ్నించారు.
మా పోరాటం వల్లే మీటింగ్స్ వాయిదా
బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటం వల్లే నేడు గోదావరి, కృష్ణా బోర్డుల మీటింగులు వాయిదా పడ్డాయని హరీశ్ రావు అన్నారు. సమావేశాలు వాయిదా పడితే సరిపోదని, ఎజెండా నుంచి తెలంగాణ రాష్ట్రానికి చెందిన 7 ప్రాజెక్టుల అంశాన్ని కచ్చితంగా తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ నెల 13 నుంచి రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కుట్రపూరితంగా ఆపేసిందని మండిపడ్డారు. కేసీఆర్ తెచ్చిన మంచి పథకాలను ఒక్కొక్కటిగా తీసేయడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ప్రభుత్వాలు మారినా పాత పథకాలను కొనసాగించాలన్న కనీస ఇంగితం ఈ ప్రభుత్వానికి లేదన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం తెచ్చిన కల్యాణ లక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా కుట్రతో, ఉద్దేశపూర్వకంగా నీరుగార్చి ఖతం చేసిందని ఆరోపించారు.
