ఎల్బీనగర్: కాళ్లకు, కడుపునకు కట్టుకుని హ్యాష్ ఆయిల్ స్మగ్లింగ్

ఎల్బీనగర్: కాళ్లకు, కడుపునకు కట్టుకుని  హ్యాష్ ఆయిల్ స్మగ్లింగ్
  •     అల్లూరి జిల్లా నుంచి బస్సులో బెంగళూరుకు తరలిస్తున్న ముఠా  
  •     పట్టుకున్న మల్కాజిగిరి పోలీసులు  
  •     ఆరుగురు అరెస్ట్  
  •     ఇందులో ఇద్దరు మైనర్లే  
  •     వివరాలు వెల్లడించిన సీపీ సుమతి  

ఎల్బీనగర్, వెలుగు : హ్యాష్​ఆయిల్​ను కడుపుకు, కాళ్లకు టేపులతో చుట్టుకుని ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు బస్సులో తరలిస్తున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను ఎల్బీనగర్ ఎస్‌‌ఓటీ, వనస్థలిపురం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎల్బీనగర్ చింతల్‌‌కుంట వద్ద ఆరుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.1.5 కోట్ల విలువైన 12 కిలోల హ్యాష్​ఆయిల్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ వివరాలను మల్కాజిగిరి సీపీ సుమతి ఎల్బీనగర్ లోని సీపీ క్యాంపు ఆఫీస్ లో వెల్లడించారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు గెమ్మెలి శ్రీను(25), ఇతడి భార్య నిబియా అలియాస్ అమ్ము(27) కలిసి గిరిజన ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతను డబ్బు ఆశ చూపి గంజాయి, హ్యాష్​ఆయిల్​సరఫరా చేయిస్తున్నారు. ఇందులో భాగంగా బెంగళూరుకు చెందిన రిసీవర్ సిజోకు హ్యాష్​ఆయిల్​సరఫరా చేస్తామని డీల్ కుదుర్చుకున్నారు. 

అల్లూరి జిల్లాకే చెందిన చిక్కుడు శ్రావణ్(21),పంగి జగదీశ్​తో పాటు మరో ఇద్దరు మైనర్లను సరఫరాకు వాడుకుంటున్నారు. ఇంతకుముందు చాలా సార్లు హైదరాబాద్ శివారు ప్రాంతం లేదా మరేదైనా చోటికి వచ్చి సిజోకు హ్యాష్​ఆయిల్​అప్పగిస్తే అడతు బెంగళూర్ కు తరలించి అమ్ముకునేవాడు. అదే ప్లాన్​లో భాగంగా  శ్రావణ్, జగదీశ్, మరో ఇద్దరు మైనర్లు ..ఒక్కొక్కరు కాలుకు కిలో చొప్పున, రెండు కాళ్లకు రెండు కిలోలు...నడుముకు మరో కిలో ప్యాకెట్లుగా చేసిన హ్యాష్​ఆయిల్ ను బ్రౌన్​టేప్​తో చుట్టి ప్రైవేట్​ట్రావెల్స్​బస్సులో వస్తున్నారు. 

పోలీసులకు సమాచారం అందడంతో ఎల్బీనగర్​చింతల్​కుంట వద్ద తనిఖీలు చేశారు.ఈ సందర్భంగా ఒక్కొక్కరి వద్ద మూడు కిలోల చొప్పున 12 కిలోల హాష్ ఆయిల్  స్వాధీనం చేసుకున్నామన్నారు.  ప్రధాన నిందితుడు శ్రీనుపై గతంలో నర్సీపట్నం, అడవి అన్నవరం పోలీస్ స్టేషన్లలో ఎన్‌‌డీపీఎస్ కేసులు ఉన్నాయని సీపీ చెప్పారు. బెంగళూరుకు చెందిన ప్రధాన రిసీవర్ సిజో పరారీలో ఉన్నారని, గాలిస్తున్నామని చెప్పారు. గెమ్మెల్లి శ్రీను ఇంతకుముందు అరెస్ట్​అయి జైలుకు వెళ్లి వచ్చినా మారలేదన్నారు. ఎల్బీనగర్​డీసీపీ అనురాధ, ఎస్ఓటీ డీసీపీ కె.మనోహర్, అడిషనల్ డీసీపీ ఎండీ. షకీర్ హుస్సేన్, వనస్థలిపురం ఏసీపీ పి.కాశీరెడ్డి  పాల్గొన్నారు.