మౌలాలిలో బిర్యానీ బిల్లు వివాదం..హోటల్‌‌పై దాడి.. ఇద్దరి అరెస్ట్

మౌలాలిలో బిర్యానీ బిల్లు వివాదం..హోటల్‌‌పై దాడి.. ఇద్దరి అరెస్ట్

మల్కాజ్​గిరి/మౌలాలి వెలుగు: మౌలాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్పీ నగర్ చిన్న బజార్ సమీపంలో బిర్యానీ బిల్లు చెల్లింపు వివాదం హింసాత్మకంగా మారింది. నాన్‌‌వెజ్ గ్రాండ్ హోటల్‌‌లో ఆదివారం రాత్రి ఎస్పీ నగర్​కే చెందిన ఎత్తర ప్రకాశ్, శ్రీకాంత్ అనే ఇద్దరు వ్యక్తులు బిర్యానీ తిని బిల్లు అడిగిన యజమానితో వాగ్వాదానికి దిగారు. 

వివాదం ముదిరి హోటల్ యజమాని విశ్వనాథ్ తోపాటు నందకిశోర్‌‌ అనే మరో వ్యక్తిపై దాడి చేసి గాయపరిచారు. అంతేకాకుండా హోటల్ సామగ్రిని ధ్వంసం చేస్తూ రాళ్లు విసిరి బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, సాంకేతిక ఆధారాలతో నిందితులిద్దరినీ గుర్తించి సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు. అనంతరం వారిని న్యాయస్థానంలో హాజరుపరిచి, జ్యుడీషియల్ రిమాండ్‌‌కు తరలించారు.