- జేఎస్‌ఎస్‌సీ- సీజీఎల్, ఇతర పరీక్షలు రద్దు
- 2014 నుంచి అన్ని రిక్రూట్‌మెంట్
- పరీక్షల్లో అక్రమాలపై సీఐడీ విచారణ
- పరీక్షల నిర్వహణలో లోపాల నివారణకు కమిటీ
- అక్రమంగా ఉద్యోగాలు పొందినోళ్లను అరెస్ట్ చేస్తాం
- కేబినెట్ భేటీ తర్వాత సీఎం హేమంత్ సోరెన్ ప్రకటన
- 24 రోజుల ఆందోళన విరమించిన అభ్యర్థులు
రాంచీ: జార్ఖండ్‌లో 24 రోజులుగా నిరసనలు చేస్తున్న విద్యార్థుల డిమాండ్లకు సీఎం హేమంత్ సోరెన్ సర్కార్ ఎట్టకేలకు అంగీకరించింది. విద్యార్థుల ప్రధాన డిమాండ్ అయిన జేఎస్‌ఎస్‌సీ- సీజీఎల్ పరీక్షతో పాటు ప్రైవేట్ సంస్థ టీడీపీఎల్ నిర్వహించిన అన్ని రిక్రూట్‌మెంట్ పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించింది. సోమవారం రాష్ట్ర సెక్రటేరియట్‌లో సుదీర్ఘంగా కొన్ని గంటలపాటు కేబినెట్ సమావేశం నిర్వహించిన తర్వాత సీఎం హేమంత్ సోరెన్ రాత్రి ఈ మేరకు ప్రకటన చేశారు. 2014 నుంచి అన్ని రిక్రూట్‌మెంట్ పరీక్షలలో జరిగిన అవకతవకలపై సీఐడీ విచారణకు కూడా ఆదేశిస్తున్నట్టు వెల్లడించారు. ‘‘పరీక్షల్లో అవకతవకలపై కొనసాగుతున్న సీఐడీ, సిట్ దర్యాప్తులలో కొన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కేబినెట్‌లో విస్తృత చర్చల తర్వాత జేఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించాం. టీడీపీఎల్ నిర్వహించిన మిగతా అన్ని పరీక్షలు కూడా రద్దు చేస్తున్నాం” అని ఆయన ప్రకటించారు. ‘‘పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వానికి ఇప్పటికే ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ) ఉంది. కానీ ఎస్‌ఓపీలను సక్రమంగా పాటించలేదు. అందుకే ఇటీవలి కాలంలో నిర్వహించిన పరీక్షలలో అవకతవకలు జరిగాయి” అని ఆయన తెలిపారు. అలాగే, రిక్రూట్‌మెంట్ పరీక్షలలో నిర్మాణపరమైన సంస్కరణలు చేపడతామని చెప్పారు. పరీక్షల ప్రక్రియను పరిశీలించి లోపాలు లేని విధంగా మార్చేందుకు తగిన దిద్దుబాటు చర్యలను సూచించడానికి సీనియర్ ఐఏఎస్ అమితాబ్ కౌశల్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పరీక్షల్లో అవకతవకలపై ప్రత్యేక విచారణ జరిపేందుకు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పరీక్షలలో మోసాలు, అక్రమాలకు పాల్పడి జేఎస్‌ఎస్‌సీ ద్వారా రిక్రూట్ అయిన వ్యక్తులను అరెస్టు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు.
ఇదీ వివాదం..
టీఎస్ఆర్ డేటా ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (టీడీపీఎల్) అనేది లక్నోకు చెందిన ఒక ప్రైవేట్ ఏజెన్సీ. ఇది జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ (జేపీఎస్‌సీ) 14వ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షతో పాటు రెండు సివిల్ సర్వీసెస్ బ్యాక్‌లాగ్ పరీక్షలను నిర్వహించింది. కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్) పరీక్షను జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జేఎస్‌ఎస్‌సీ) 2024లో నిర్వహించింది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలలో సుమారు 1,800 మంది అభ్యర్థులు ఇప్పటికే నియమితులయ్యారు. అయితే, ఈ ఏడాది జేపీఎస్‌సీ నిర్వహించిన14వ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై జులై 22న సీఐడీ కేసు నమోదు చేయడంతో రిక్రూట్‌మెంట్ పరీక్షలకు సంబంధించిన కొత్త వివాదం ప్రారంభమైంది.
పరీక్షలకు సంబంధించి అవకతవకలకు పాల్పడినందుకు జేపీఎస్‌సీ మాజీ చైర్మన్ ఎల్. ఖియాంగ్తేతో పాటు టీడీపీఎల్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌లు, ఇతర మధ్యవర్తులను సీఐడీ ఇదివరకే అరెస్టు చేసింది. జేఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పరీక్షలో కూడా టీడీపీఎల్ సిండికేట్ ప్రమేయం ఉందని దర్యాప్తులో తేల్చింది. ఈ నేపథ్యంలో జులై 22 నుంచి విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళనలను ప్రారంభించారు. రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియం వద్ద బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు. వీరిలో కొందరు నిరాహార దీక్ష కూడా చేపట్టారు. విద్యార్థులు ఈ నెల 10న అసెంబ్లీ ముట్టడికి యత్నించడం, పోలీసులు లాఠీచార్జ్ చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. డిమాండ్లు నెరవేరకపోతే ఈ నెల 20న సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని విద్యార్థులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పరీక్షలను రద్దు చేస్తున్నట్టు సీఎం హేమంత్ సోరెన్ కీలక ప్రకటన చేశారు.
విద్యార్థుల సంబరాలు.. మహతో దీక్ష విరమణ
డిమాండ్లకు అంగీకరిస్తూ సీఎం సోరెన్ ప్రకటన చేసిన తర్వాత రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియం వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. అయితే, టీడీపీఎల్ నిర్వహించిన అన్ని పరీక్షలు, జేఎస్‌ఎస్‌సీ సీజీఎల్ రద్దు అనే రెండు ప్రధాన డిమాండ్లు నెరవేరినప్పటికీ, పరీక్షల్లో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రధాన డిమాండ్లు నెరవేరినందున.. ఈ డిమాండ్‌ను వారు కొనసాగిస్తారా లేదా అనేదానిపై స్పష్టత రాలేదు. ఇక హేమంత్ సోరెన్ ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్ల మేరకు ఆయా పరీక్షలను రద్దు చేయడంతో యాక్టివిస్ట్ దేవేంద్ర నాథ్ మహతో తన నిరాహార దీక్షను విరమించారు. ఇక్కడ విద్యార్థులు 24 రోజులుగా ఆందోళనలు చేస్తుండగా, దేవేంద్రనాథ్‌తో పాటు ఆరుగురు 14 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం దిగిరావడంతో వీరంతా దీక్షలు విరమించారు. కాగా, తమ ఆందోళనకు మద్దతు తెలిపిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, మీడియాకు, పోలీసులకు, డిమాండ్లను అంగీకరించిన ప్రభుత్వానికి మహతో కృతజ్ఞతలు తెలిపారు.
సోరెన్‌కు రాహుల్ లేఖ
రాంచీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులతో స్వయంగా సమావేశమై చర్చించాలని సీఎం హేమంత్ సోరెన్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ఉదయం లేఖ రాశారు. విద్యార్థుల మాటలు విని వారి సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించినదని, అది ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. పేపర్ లీకులు, విద్యా వ్యవస్థలో అవకతవకలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు కాంగ్రెస్ అండగా నిలిచిందన్నారు. జార్ఖండ్‌లోనూ విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవేనని చెప్పారు. పలు డిమాండ్లపై ప్రభుత్వం, విద్యార్థుల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు కనిపిస్తున్నప్పటికీ ఆందోళన కొనసాగుతోందన్నారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న భరోసా కల్పించాలని సూచించారు.
