- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం జనగణనలో బీసీ కులగణన చేపడతామని పార్లమెంట్‌లో ప్రకటించి, ఇప్పుడు ఆ మాట తప్పిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కేంద్ర కేబినెట్‌లో గతంలో కులగణన చేస్తామని ప్రకటించినప్పటికీ, ఇటీవల విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో ఓబీసీల ప్రస్తావన లేకపోవడం విచారకరమని, ఇది బీసీలను మభ్యపెట్టడమేనని విమర్శించారు. బీసీలకు ఏమాత్రం ఉపయోగపడని ఈ గెజిట్ నోటిఫికేషన్ ప్రతులను చింపి తమ నిరసనను వ్యక్తం చేశారు.
సోమవారం గుంటూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల విడుదల చేసిన 40 ప్రశ్నల గెజిట్‌లో ఓబీసీల ప్రస్తావన గానీ, వారి కులాల వివరాల సేకరణ గానీ లేకపోవడంపై స్పష్టత ఇవ్వాలని జాజుల డిమాండ్ చేశారు. తెలంగాణ, బిహార్‌లో నిర్వహించిన కులగణనను నమూనాగా తీసుకొని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో పాటు ఇతర కులాల జాబితాను విడుదల చేసి, ప్రతి కులానికి యూనిక్ కోడ్ కేటాయించి శాస్త్రీయంగా లెక్కింపు చేపట్టాలని కోరారు. కేంద్రం వెంటనే గెజిట్‌ను సవరించకపోతే వచ్చే నవంబర్‌లో ఢిల్లీ వేదికగా బీసీల సమర భేరి మోగిస్తామని హెచ్చరించారు.
