- గోదావరి బేసిన్లో 6.06 లక్షల ఎకరాలకు.. కృష్ణాలో 95 వేల ఎకరాలకు
- దేవాదుల కిందే అత్యధికంగా 2.74 లక్షల ఎకరాలకు
- వారం రోజుల్లో శ్రీశైలంలో 21 టీఎంసీలు ఖాళీ..
- పోతిరెడ్డిపాడు నుంచి రోజూ 10 వేల క్యూసెక్కులు ఏపీకి
వానాకాలం సీజన్లో ఆరుతడి పంటలకు సాగునీరివ్వాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను దృష్టిలో పెట్టుకొని.. తాగునీటికి ప్రాధాన్యం ఇస్తూనే పంటలనూ కాపాడుకోవాలని భావిస్తున్నది. గోదావరి బేసిన్లో 6,05,955 ఎకరాలకు, కృష్ణా బేసిన్లో 95,108 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు నీటిపారుదల శాఖ ప్రకటించింది.
హైదరాబాద్, వెలుగు: వానాకాలం సీజన్లో ఆరుతడి పంటలకు సాగునీరివ్వాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను దృష్టిలో పెట్టుకొని.. తాగునీటికి ప్రాధాన్యం ఇస్తూనే పంటలనూ కాపాడుకోవాలని భావిస్తున్నది. గోదావరి బేసిన్లో 6,05,955 ఎకరాలకు, కృష్ణా బేసిన్లో 95,108 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు నీటిపారుదల శాఖ ప్రకటించింది.
కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో తగినన్ని నీళ్లు లేనందున ఆయకట్టుకు తక్కువ నీటినే విడుదల చేయనున్నారు. గోదావరి బేసిన్లో పలు ప్రాజెక్టులు ఇప్పటికే నిండడంతో అక్కడ ఎక్కువ నీళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ బేసిన్లో అత్యధికంగా దేవాదుల కింద 2,74,683 ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వనున్నారు. ఇక్కడ వరంగల్, ములుగు, హనుమకొండ, జనగామ జిల్లాల్లో సాగుచేసిన పంటలకు సాగునీరు అందిస్తారు.
నిజాంసాగర్ ప్రాజెక్ట్ కింద కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో 1,24,254 ఎకరాలకు, కడెం ప్రాజెక్టు కింద ఆదిలాబాద్ జిల్లాలో 61 వేల ఎకరాలకు, సాత్నాల కింద ఆదిలాబాద్‌లో 24 వేల ఎకరాల చొప్పున మొత్తంగా 6.06 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నారు. కృష్ణా బేసిన్లో మాత్రం వానాకాలం సాగుకు కష్టాలు తప్పేలా లేవు. ఇక్కడ కేవలం 95,108 ఎకరాలకు నీళ్లిచ్చేలా ప్లాన్ రెడీ చేశారు.
మూసీ కింద సూర్యాపేట జిల్లాలో 30 వేల ఎకరాలకు అత్యధికంగా నీళ్లు ఇస్తారు. పాకాల కింద వరంగల్ జిల్లాలో 18,193 ఎకరాలు, వైరా కింద ఖమ్మంలో 17,390 ఎకరాలు, డిండి కింద నల్గొండ జిల్లాలో 12,975 ఎకరాలు, లంకాసాగర్ కింద ఖమ్మంలో 7,350, బయ్యారం కింద మహబూబాబాద్‌లో 7,200 ఎకరాలు, కోటిపల్లి ప్రాజెక్ట్ కింద వికారాబాద్ జిల్లాలో 2 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు.
శ్రీశైలం ఖాళీ చేస్తున్నరు
కృష్ణా బేసిన్లో ప్రస్తుతం గడ్డు పరిస్థితులే కనిపిస్తున్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి స్థాయిలో నిండలేదు. ఇటు నిండేదశలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులోనూ నీళ్లు ఖాళీ అవుతున్నాయి. కృష్ణా బేసిన్లో అంతో ఇంతో వరద వచ్చిందంటే జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులోకే.
శ్రీశైలం ప్రాజెక్టులోకి ఈ సీజన్లో ఇప్పటివరకు 182 టీఎంసీల వరద రాగా.. వచ్చిన వరదను వచ్చినట్టే ఏపీ మళ్లించుకున్నది. వారం క్రితం వరకు ప్రాజెక్టులో 186 టీఎంసీల నీళ్లుండగా.. ప్రస్తుతం 165 టీఎంసీలకు తగ్గిపోయింది. అంటే ఒక్క వారంలోనే 21 టీఎంసీల సామర్థ్యం తగ్గిపోయింది.
పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ రోజూ 10 వేల క్యూసెక్కులను తరలిస్తున్నది. తాగునీటి అవసరాలని చెప్తూనే.. తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ కింద ఆయకట్టుకు నీటిని తీసుకెళ్తున్నది. ఎల్‌నినో ప్రభావం ఉందని తెలిసినా.. తాగునీటిని జాగ్రత్తగా చూసి వాడుకోవాల్సిఉన్నా ఏపీ మాత్రం సాగు కోసం విచ్చలవిడిగా నీటిని తరలిస్తున్నది. పొరుగు రాష్ట్రం ఇప్పటికే 20 నుంచి 30 టీఎంసీల వరకు నీటిని తీసుకెళ్లిందని చెబుతున్నారు.
అదే సమయంలో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కింద తాగునీటి అవసరాలు తీర్చుకునేలా.. మన ప్రభుత్వం శ్రీశైలం నుంచి జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ సాగర్‌లోకి నీటిని విడుదల చేస్తున్నది. దీంతో సాగర్ లోకి 27 టీఎంసీల వరకు నీళ్లు చేరాయి. వాటిని తాగునీటి అవసరాలకే వినియోగించనున్నారు.
గోదావరి బేసిన్
ప్రాజెక్టు నీళ్లిచ్చే విస్తీర్ణం(ఎకరాల్లో)
దేవాదుల 2,74,683
నిజాంసాగర్ 1,24,254
కడెం ప్రాజెక్టు 61,000
సాత్నాల 24,000
కృష్ణా బేసిన్
ప్రాజెక్టు నీళ్లిచ్చేవిస్తీర్ణం(ఎకరాల్లో)
మూసీ 30,000
పాకాల 18,193
వైరా 17,390
డిండి 12,975
లంకాసాగర్ 7,350
బయ్యారం 7,200
కోటిపల్లి 2,000
