నిరుద్యోగులకు గాలం..ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై లీడర్ల ఫోకస్

 నిరుద్యోగులకు గాలం..ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై లీడర్ల ఫోకస్
  • మార్చిలో ముగియనున్న తీన్మార్  మల్లన్న పదవీకాలం
  • నిరుద్యోగులకు ఉచిత కోచింగ్, మెటీరియల్  పంపిణీ చేస్తున్న ఆశావహులు
  • కాంగ్రెస్  టికెట్  ఆశిస్తున్న వారిలో పలువురు ముఖ్య నేతల వారసులు, అనుచరులు

ఖమ్మం, వెలుగు:  వచ్చే ఏడాది జరగనున్న ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఆశావహులు ఇప్పటి నుంచే తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒకవైపు పార్టీ టికెట్  కోసం ప్రయత్నాలు చేసుకుంటూనే, మరోవైపు నిరుద్యోగులకు గాలం వేస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ పదవీకాలం మార్చి నెలాఖరు వరకు ఉన్నప్పటికీ, అంతకు ఒకట్రెండు నెలల ముందుగానే ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. 

దీంతో అక్టోబర్​లోనే ఓటర్ల రిజిస్ట్రేషన్  ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ప్రస్తుతం 11 జిల్లాలు, 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈక్రమంలో రాష్ట్రప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తుండడంతో వాటి ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆశావహులు ప్లాన్​ చేస్తున్నారు. 

పోటీ చేయాలనుకుంటున్న ఓ అభ్యర్థి నిరుద్యోగులకు ఉచిత కోచింగ్  క్లాసులు ఏర్పాటు చేస్తుండగా, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన మరో క్యాండిడేట్​ కొన్ని నెలల నుంచే మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో రెగ్యులర్​గా పర్యటిస్తూ నిరుద్యోగులతో టచ్ లో ఉంటున్నాడు. వీళ్లతో పాటు మరికొందరు ఈ ఎలక్షన్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. ఇలాంటి వారిలో ముఖ్య నేతల వారసులు, మంత్రుల ముఖ్య అనుచరులు కూడా ఉన్నారు.

ఫ్రీ కోచింగ్, ఫ్రీ మెటీరియల్!

గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కొందరు అభ్యర్థులు నిరుద్యోగులతో టచ్ లో ఉంటున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్​ తరపున ఏనుగుల రాకేశ్​రెడ్డి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఈసారి కూడా ఆయనే పోటీ చేస్తారని బీఆర్ఎస్​ వర్కింగ్  ప్రెసిడెంట్  కేటీఆర్  ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. 

ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన సర్​ అవగాహన సదస్సులతో పాటు పార్టీ కార్యక్రమాల్లో రాకేశ్ రెడ్డిని కేటీఆర్  ప్రమోట్  చేస్తున్నారు. ఇప్పటికే అతను ఈ క్లాసెస్​ పేరుతో పోటీ పరీక్షల మెటీరియల్ తో రూపొందించిన యాప్ ను అందుబాటులోకి తెచ్చారు.

 ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి అనుచరుడు మెండెం కిరణ్ కుమార్  ఉచితంగా కోచింగ్  క్లాసెస్​ నిర్వహిస్తున్నారు. రైట్  చాయిస్​ అకాడమీ పేరుతో ఆయన గత కొన్నేళ్లుగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. తాజాగా ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం మూడు ఉమ్మడి జిల్లాల్లోని నిరుద్యోగులకు ఫ్రీగా పుస్తకాలతో పాటు కోచింగ్  క్యాంప్ లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది.

కాంగ్రెస్​లో పోటాపోటీ

ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీగా ప్రస్తుతం తీన్మార్​ మల్లన్న(చింతపండు 
నవీన్​) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్​ తరపున ఆయన గెలిచినా, తర్వాత పార్టీ నుంచి సస్పెండ్  అయ్యారు. వచ్చే ఏడాది మార్చి 29తో మల్లన్న పదవీకాలం ముగుస్తుండగా, ఈసారి కాంగ్రెస్​ టికెట్  కోసం చాలా మంది పోటీపడుతున్నారు. 

ఇటీవల ఇన్​చార్జి మంత్రులు కూడా ఎమ్మెల్యేలతో సమావేశమై ఆశావహుల పేర్లను తీసుకున్నారు. శాసనమండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి కొడుకు డెయిరీ  డెవలప్​మెంట్  కార్పొరేషన్  చైర్మన్​ గుత్తా అమిత్ రెడ్డి ఈ ఎన్నికల ద్వారా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపడాలని భావిస్తున్నారు. ఇక రేసులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు సాదు రమేశ్​రెడ్డి, మంత్రి పొంగులేటి అనుచరుడు మెండెం కిరణ్​, టూరిజం డెవలప్​మెంట్  కార్పొరేషన్​ మాజీ చైర్మన్​ పటేల్  రమేశ్​ రెడ్డి, బీసీ కోటాలో నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్​ నేత సహా పలువురు టికెట్ ఆశిస్తున్నారు. ఎవరికి వారు గాడ్​ఫాదర్ల ద్వారా ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

 మరోవైపు బీజేపీ తరపున గత రెండు ఎన్నికల్లో గుజ్జుల ప్రేమేందర్​రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి యువకులకు టికెట్  కేటాయించాలన్న డిమాండ్ ఉండగా, మాజీ ఎమ్మెల్యే​సంకినేని వెంకటేశ్వరరావు కొడుకు సంకినేని వరుణ్​రావు పోటీపడుతున్నారు. బీజేవైఎం ద్వారా ఇప్పటికే ఆయన పార్టీలో యాక్టివ్​గా ఉన్నారు.