నేరం చిన్నదైనా జాబ్‌‌ అప్లికేషన్‌‌లో చెప్పాల్సిందే..కానిస్టేబుల్‌‌ శ్రీనివాస్‌‌ కేసులో సుప్రీంకోర్టు స్పష్టత

నేరం చిన్నదైనా జాబ్‌‌ అప్లికేషన్‌‌లో చెప్పాల్సిందే..కానిస్టేబుల్‌‌ శ్రీనివాస్‌‌ కేసులో సుప్రీంకోర్టు స్పష్టత

న్యూఢిల్లీ, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తమపై నమోదైన చిన్న కేసుల వివరాలను కూడా అప్లికేషన్‌‌లో వెల్లడించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది అభ్యర్థి కనీస బాధ్యత అని పేర్కొంది. వరంగల్‌‌ జిల్లాకు చెందిన ఎస్‌‌. శ్రీనివాస్‌‌ పిటిషన్‌‌పై బుధవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ, పోలీస్‌‌ రిక్రూట్‌‌మెంట్‌‌ బోర్డుకు నోటీసులు జారీ చేసింది. 2008లో శ్రీనివాస్‌‌ కానిస్టేబుల్‌‌ (ఏఆర్‌‌) పోస్టుకు ఎంపికయ్యాడు.

బ్యాక్‌‌గ్రౌండ్‌‌ వెరిఫికేషన్‌‌లో భాగంగా 2006లో అతడిపై పరకాల పీఎస్​లో కేసు నమోదైనట్లు బయటపడింది. ఈ కేసులో కోర్టు రూ.300 జరిమానా విధించినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని ఉద్యోగ దరఖాస్తులో వెల్లడించకపోవడంతో 2009లో శ్రీనివాస్‌‌ ఎంపికను అధికారులు రద్దు చేశారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పోలీస్‌‌ ఉద్యోగానికి అత్యున్నత ప్రవర్తన, నిజాయితీ అవసరమని, నేర చరిత్రను ఉద్దేశపూర్వకంగా దాచడం క్షమించరాదని హైకోర్టు పేర్కొంది.

ఈ తీర్పును శ్రీనివాస్‌‌ సుప్రీంకోర్టులో సవాల్‌‌ చేశారు. జస్టిస్‌‌ అరవింద్‌‌ కుమార్‌‌, జస్టిస్‌‌ విపుల్‌‌ ఎం. పంచోలితో కూడిన ధర్మాసనం పిటిషన్‌‌పై విచారణ జరిపింది. శ్రీనివాస్‌‌ తరఫు న్యాయవాది వాదిస్తూ.. కేసు నమోదైనప్పుడు ఆయన మైనర్‌‌ అని, పైగా అవి చిన్న నేరాలని తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ‘అవతార్‌‌ సింగ్‌‌’ తీర్పును ప్రస్తావించారు. ఈ వాదనపై ధర్మాసనం స్పందిస్తూ.. నేరం చిన్నదైనా దాని వివరాలను దరఖాస్తులో వెల్లడించడం అభ్యర్థి బాధ్యత అని స్పష్టం చేసింది. ప్రతివాదులు ఎనిమిది వారాల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్‌‌ 16కు వాయిదా వేసింది.