2030 నాటికి బ్యాటరీ రీసైక్లింగ్ పెద్ద సవాల్..భూమిలో కలవకుండా ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి

2030 నాటికి బ్యాటరీ రీసైక్లింగ్ పెద్ద సవాల్..భూమిలో కలవకుండా ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి
  • పీసీబీలో బ్యాటరీ వ్యర్థాల నిర్వహణ వర్క్‌‌షాప్​లో  సైంటిస్టుల అభిప్రాయం 

హైదరాబాద్ సిటీ, వెలుగు: 2030 నాటికి భారీ స్థాయిలో ఎండ్ ఆఫ్  లైఫ్  బ్యాటరీలు వ్యర్థాలుగా మారే అవకాశం ఉందని ఆ సమయానికి రీసైక్లింగ్​కు అసలైన సవాళ్లు ఎదురవుతాయని సైంటిస్టులు అభిప్రాయపడ్డారు. బుధవారం హైదరాబాద్ లోని సనత్ నగర్‌‌‌‌ టీజీపీసీబీ ఆఫీస్​లో ‘పవర్  సర్క్యులారిటీ ఎక్స్‌‌టెండెడ్  ప్రొడ్యూసర్  రెస్పాన్సిబిలిటీ’ అనే అంశంపై వర్క్ షాప్  నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకు టీజీ పీసీబీ మెంబర్  సెక్రటరీ జి. రవి, సీపీసీబీ రీజినల్  డైరెక్టర్  వరలక్ష్మి, వివిధ రాష్ట్రాల సైంటిస్టులు హాజరయ్యారు. ఈ వర్క్‌‌షాప్‌‌లో బ్యాటరీ వ్యర్థాల నిర్వహణ, భవిష్యత్  సవాళ్లు వంటి కీలక అంశాలపై చర్చించారు. 

ఈ సందర్భంగా టీజీపీసీబీ సెక్రటరీ రవి మాట్లాడుతూ..  ‘తెలంగాణ రైజింగ్ 2047’ లో భాగంగా 2030 నాటికి పబ్లిక్  ట్రాన్స్‌‌పోర్ట్‌‌ను పూర్తిగా విద్యుద్దీకరించడంతో పాటు నెట్-జీరో ఉద్గారాలు(కార్బన్ డయాక్సైడ్),  గ్రీన్ ఎనర్జీ విస్తరణ, సర్క్యులర్  ఎకానమీ విధానాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. 2026 సెప్టెంబర్  15 నుంచి 18 వరకు గుజరాత్  రాష్ట్రం గాంధీనగర్ లో  జరగనున్న వరల్డ్  సర్క్యూలర్  ఎకనమిక్  ఫోరంలో ఇక్కడ చర్చించిన అంశాలు, సిఫార్సులను నివేదిక రూపంలో అందజేయనున్నట్లు తెలిపారు. 

ప్రముఖ సైంటిస్టు డాక్టర్  సుందర్  మాయవన్  మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో భారీ బ్యాటరీ వ్యర్థాల ప్రవాహాన్ని తట్టుకునేందుకు కేవలం హార్డ్-కోర్  రీసైక్లింగ్‌‌పైనే కాకుండా, బ్యాటరీల పునర్వినియోగం(సెకండ్-  లైఫ్  అప్లికేషన్స్) రీపర్పసింగ్‌‌పై దృష్టి సారించాలన్నారు. లైఫ్  ఎండ్  బ్యాటరీలు నేరుగా భూమిలో కలవకుండా ప్రభుత్వాలు జోక్యం చేసుకొని పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. 

జంషెడ్ పూర్ లోని కౌన్సిల్  ఆఫ్  సైంటిఫిక్  అండ్  ఇండస్ట్రియల్  రీసెర్చ్ - నేషనల్  మెటలర్జికల్  లేబొరేటరీ(సీఎస్‌‌ఐఆర్‌‌‌‌ఎన్‌‌ఎంఎల్)కి చెందిన సైంటిస్టు డాక్టర్  ప్రతిమా మెశ్రామ్ మాట్లాడుతూ.. సాధారణంగా పరిశ్రమల్లో బ్యాటరీ తయారు చేసి దాన్ని యూజ్  చేసిన తర్వాత వ్యర్థంగా పారేస్తారు. వాడి పడేసిన బ్యాటరీలను మళ్లీ రీసైకిల్  చేసి, వాటిలోని విలువైన ఖనిజాలను వెలికి తీసి కొత్త బ్యాటరీల తయారీకి ఉపయోగించడాన్నే ‘గ్రేవ్ - టు -క్రాడెల్’ అంటారని చెప్పారు. ఈ విధానం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా సహజ వనరులు రక్షించవచ్చన్నారు.