- అదనపు కలెక్షన్లలో ఎఫ్‌డీసీకి 20% జమ చేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: సినీ నిర్మాతలు తమ సినిమా టికెట్ రేట్ల ద్వారా వచ్చిన అదనపు ఆదాయంలో 20 శాతం మొత్తాన్ని ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎఫ్‌డీసీ) ఖాతాలో జమ చేయకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. మన శంకర వరప్రసాద్(చిరంజీవి), రాజాసాబ్(ప్రభాస్), అఖండ 2(బాలకృష్ణ ), పెద్ది( రామ్ చరణ్ ) సినిమాల నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది.
వెంటనే అదనపు ఆదాయ వివరాలను సమర్పించాలని.. ఎఫ్‌డీసీ చెల్లించాల్సిన 20 శాతం బకాయిలను జమ చేయాలని స్పష్టం చేసింది. లేకుంటే భవిష్యత్తులో రాబోయే సినిమాలకు టికెట్ రేట్ల పెంపు లేదా ప్రత్యేక షోల అనుమతులు ఇవ్వమని పరోక్షంగా హెచ్చరించింది. ఈ మేరకు నలుగురు సినీ నిర్మాతలకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్ ఇటీవల నోటీసులు ఇష్యూ చేశారు.
భారీ బడ్జెట్ సినిమాల విడుదల టైంలో నిర్మాతలు టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు ప్రభుత్వ అనుమతి కోరుతుండగా.. వచ్చిన అదనపు కలెక్షన్లలో 20 శాతాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్, తెలంగాణ ఎఫ్‌డీసీ ఖాతాకు జమ చేయాలనే షరతుపై ప్రభుత్వం పర్మిషన్స్ ఇస్తున్నది. అయితే, నిర్మాతలు మాత్రం అదనపు కలెక్షన్లలో 20 శాతాన్ని చెల్లించకపోవడంతో.. వెంటనే బకాయిలను జమ చేయాలని ప్రభుత్వం నోటీసులిచ్చింది.
