జనగామ, వెలుగు : పొగాకు నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్లో ఆఫీసర్లతో నిర్వహించిన మీటింగ్లో ఆయన మాట్లాడారు. బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయడం నేరమని, ఈ నియమాన్ని ఉల్లంఘించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
పాఠశాలలకు వంద మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల వినియోగం, విక్రయాలపై పోలీసులు నిఘా పెంచాలని, కోట్పా యాక్ట్ ను కఠినంగా అమలు చేయాలని అదేశించారు. హెచ్ఐవీ పరీక్షలను విరివిగా చేపట్టి, ప్రజలకు అవగాహన సమావేశాలు నిర్వహించి, తద్వారా హెచ్ఐవీ రహిత జిల్లాను నిర్మించాలని సూచించారు. హెచ్ఐవీపై నిర్వహించే ప్రచార కార్యక్రమ క్యూ ఆర్ కోడ్ను ఆయన ఆవిష్కరించారు. మీటింగ్లో డీసీపీ రాజ మహేంద్ర నాయక్, డీఎంహెచ్వో వాణిశ్రీ, డ్రగ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తదితరులున్నారు.
