వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా 18 దేశాలకు చెందిన 28 మంది విదేశీ ఆఫీసర్లు, జర్నలిస్టులతో కూడిన బృందం శనివారం యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శించింది. ఆలయ శిల్పకళ, కాకతీయుల నిర్మాణ నైపుణ్యాన్ని ప్రతినిధులు ప్రశంసించారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత సాంకేతిక, ఆర్థిక సహకార కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న సామర్థ్య వికాస శిక్షణలో భాగంగా ఈ పర్యటన చేపట్టారు.
ఈ సందర్భంగా రామప్ప గైడ్ విజయ్ ఆలయ విశిష్టత, యునెస్కో గుర్తింపు ప్రాధాన్యత, శిల్పకళ, నిర్మాణ పద్ధతులను వివరించారు. కాకతీయుల ఇంజినీరింగ్ నైపుణ్యం, ఇసుక పునాది, తేలికపాటి ఇటుకల వినియోగం, శిల్పకళ ప్రతిభను విదేశీ ప్రతినిధులు ఆసక్తిగా పరిశీలించి అభినందించారు. కార్యక్రమంలో అల్జీరియా, భూటాన్, కాంబోడియా, ఫిజీ, ఘనా, శ్రీలంక, వియత్నాం, జాంబియా, జింబాబ్వే తదితర 18 దేశాలకు చెందిన ఆఫీసర్లు, పాత్రికేయులు పాల్గొన్నారు. వారివెంట డీపీఆర్‌వో రఫీక్, అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్, సంబంధిత ఆఫీసర్లు, టూరిస్ట్ పోలీసులు ఉన్నారు.
