భారత్ vs పాక్ మ్యాచుకు రికార్డ్ వ్యూస్.. ఆసియా క్రీడలకు కాసుల వర్షం!

భారత్ vs పాక్ మ్యాచుకు రికార్డ్ వ్యూస్.. ఆసియా క్రీడలకు కాసుల వర్షం!

India vs Pakistan Rivalry: జపాన్ వేదికగా అట్టహాసంగా ముగిసిన 20వ ఆసియా క్రీడలు (Asian Games 2026).. పలు లాజిస్టికల్ సమస్యలు, వసతి ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ అన్ని విధాలుగా అద్భుత విజయాలను సాధించాయని ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) స్పష్టం చేసింది. సుమారు 20 శాతం ఆదాయ వృద్ధి, భారీ వీక్షణ సంఖ్య (Viewership), సంచలన ప్రపంచ రికార్డులు ఈ టోర్నమెంట్ విజయానికి నిదర్శనమని OCA అధికారులు వెల్లడించారు.

ఆర్గనైజింగ్ కమిటీ క్షమాపణలు: 

ఈ మెగా టోర్నమెంట్‌లో ఊహించని విధంగా చివరి నిమిషంలో ఎంట్రీలు పెరగడంతో పాల్గొనే అథ్లెట్ల సంఖ్య ఏకంగా 17,000కు చేరుకుంది. ఇది అంచనా వేసిన దానికంటే దాదాపు 2,000 మంది ఎక్కువ.. అయితే అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా అథ్లెట్స్ విలేజ్ (Athletes' Village) అందుబాటులో లేకపోవడంతో.. హోటళ్లు, కంటైనర్-శైలి నివాసాలు, చివరికి క్రూజ్ షిప్‌లలో కూడా వసతి కల్పించాల్సి వచ్చింది. చిన్న గదులు, చిన్న మంచాలు ఉండటంతో అథ్లెట్లు, టీమ్ ఆఫీషియల్స్ నుంచి కొన్ని ఫిర్యాదులు రావడంతో.. ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ జనరల్ సతోషి మురాటే (Satoshi Murate) దీనిపై స్పందించి క్షమాపణలు కోరారు.

సవాళ్లను దాటి రికార్డుల మోత: OCA

ఇబ్బందులు తలెత్తినప్పటికీ, క్రీడాకారులు ప్రదర్శించిన ప్రతిభ అసాధారణమని OCA డైరెక్టర్ జనరల్ హుసైన్ అల్-ముసల్లమ్ (Husain Al-Musallam) ప్రశంసించారు. ఈ క్రీడల్లో ఏకంగా 54 ప్రపంచ రికార్డులు, 11 జూనియర్ ప్రపంచ రికార్డులు, 89 కాంటినెంటల్ రికార్డులు నమోదయ్యాయని ఆయన గుర్తు చేశారు. అథ్లెట్లకు మంచి రవాణా, నాణ్యమైన ఆహారం, మెరుగైన ఆరోగ్య సదుపాయాలు అందిస్తేనే వారు ఈ స్థాయి ప్రదర్శన ఇవ్వగలరు.. సంఖ్యలే నిజం చెబుతున్నాయి, అవే నిదర్శనమని పేర్కొన్నారు.

ఆదాయ వృద్ధికి భారత్ మ్యాచ్‌లదే కీలక పాత్ర: 

గతంలో హంగ్జూ వేదికగా జరిగిన ఆసియా క్రీడలతో పోలిస్తే ఈసారి ఆదాయంలో దాదాపు 20శాతం వృద్ధి నమోదైంది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల విస్తృతి, వ్యూవర్ షిప్ విపరీతంగా పెరగడానికి ముఖ్య కారణమని OCA అధికారులు తెలిపారు. ముఖ్యంగా భారత్ ఆడిన హాకీ, క్రికెట్ మ్యాచ్‌లు (పాకిస్థాన్‌తో పోరు) టెలివిజన్ ప్రేక్షకులను భారీ సంఖ్యలో ఆకర్షించాయని వెల్లడించారు.

అలాగే నగోయాలో ఎలాంటి భారీ ఆర్థిక భారాలు మిగిల్చే శాశ్వత నిర్మాణాలు (White elephants) లేకుండా, పర్యావరణ హితంగా, ఆర్థికంగా సుస్థిరమైన మోడల్‌ను అనుసరించామని, భవిష్యత్‌లోనూ ఇలాంటి నమూనాలే ఆచరణీయమని OCA అభిప్రాయపడింది. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ చీఫ్ తయ్యబ్ ఇక్రమ్ మాట్లాడుతూ.. ఎలాంటి సవాళ్లు ఎదురైనా అందరూ కలిసికట్టుగా పనిచేసి టోర్నమెంట్‌ను విజయవంతం చేశామని కొనియాడారు.