- 2014 నుంచి జరిగిన 17 పరీక్షలపై సీఐడీ దర్యాప్తు
- మరో 6 రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్స్ వాయిదా
- కేబినెట్ భేటీ తర్వాత లిస్ట్ రిలీజ్
- పరీక్షల రద్దుపై ఇప్పటికే రిక్రూట్ అయిన అభ్యర్థుల నిరసనలు
రాంచీ: రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో అవకతవకలపై విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్‌సీ), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జేఎస్‌ఎస్‌సీ) నిర్వహించిన మొత్తం 44 రిక్రూట్‌మెంట్ పరీక్షలను రద్దు చేస్తూ జార్ఖండ్ ప్రభుత్వం మంగళవారం రాత్రి జాబితాను విడుదల చేసింది. రద్దు చేసిన పరీక్షలలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిప్యూటీ కలెక్టర్లు, డెంటల్ డాక్టర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, సివిల్ జడ్జీలు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు తదితర నియామక పరీక్షలు ఉన్నాయి.
ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో లెక్చరర్లు, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్లు, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, వివిధ పరిపాలనా, సాంకేతిక పోస్టుల పరీక్షలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. సీఎం హేమంత్ సోరెన్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సిబ్బంది, పరిపాలనా సంస్కరణలు, రాజభాష శాఖ దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
జేపీఎస్‌సీ, ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీఎల్ ద్వారా నిర్వహించిన, కొనసాగుతున్న పరీక్షలలో అవకతవకలపై వచ్చిన ఫిర్యాదులు, సీఐడీ దర్యాప్తులో ప్రభుత్వం ముందుంచిన వాస్తవాల ఆధారంగానే ఆయా పరీక్షలను రద్దు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ‘‘జేపీఎస్‌సీ, జెఎస్‌ఎస్‌సీ పరీక్షలకు సంబంధించిన అవకతవకలు, దుష్ప్రవర్తనపై నమోదైన కేసులను విచారించడానికి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని హైకోర్టును అభ్యర్థిస్తాం’’ అని వెల్లడించింది.
అలాగే, 2014 నుంచి జేపీఎస్‌సీ, జేఎస్‌ఎస్‌సీ నిర్వహించిన 17 పరీక్షలు, ఫలితాలు, నియామకాలపై సీఐడీ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. మరో 6 రిక్రూట్‌మెంట్ పరీక్షలను వాయిదా వేసింది. కాగా, పరీక్షల్లో అక్రమాలపై అభ్యర్థులు, యువత 25 రోజులపాటు ఆందోళనలు చేసిన తర్వాత ఈ నెల 17న ప్రభుత్వం దిగివచ్చింది.
ఉద్యోగాల్లో చేరిన అభ్యర్థుల నిరసనలు
జేఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పరీక్షలో ఉత్తీర్ణులై నియామకాలు కూడా పొందిన అభ్యర్థులు కేబినెట్ నిర్ణయంపై నిరసనలకు దిగారు. ఈ పరీక్ష ద్వారా ఉద్యోగాలు పొందిన సచివాలయ ఉద్యోగులు మంగళవారం ప్రాజెక్ట్ భవన్ బయట ఆందోళన నిర్వహించారు. ఆ తర్వాత ఎంపికైన అభ్యర్థులు ప్రాజెక్ట్ భవన్ నుంచి బిర్సా చౌక్ వరకు నిరసన మార్చ్ చేపట్టారు. నిరసన కొనసాగుతుండటంతో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
గుర్తింపు కార్డులు చూపించిన తర్వాతే పాత ఉద్యోగులను లోపలికి అనుమతించగా, నిరసన తెలుపుతున్న అభ్యర్థులు ప్రధాన గేటు వెలుపల గుమిగూడారు. మొత్తం రిక్రూట్‌మెంట్ ప్రక్రియను రద్దు చేయడం కాకుండా, అవకతవకలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
