దేశీయ కార్పొరేట్ రంగంలో ఉద్యోగులకు ఇచ్చే జాబ్ టైటిల్స్, చెల్లించే జీతాల మధ్య భారీ గ్యాప్ ఉన్నట్లు ప్రముఖ జాబ్ పోర్టల్ ‘ఇండీడ్’ తాజాగా వెల్లడించింది. కంపెనీలు అందిస్తున్న పదవులకు, ఇస్తున్న వేతనాలకు పొంతన కుదరడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపునకు, ప్రతిఫలానికి మధ్య పెరుగుతున్న ఈ వ్యత్యాసం వర్క్‌ప్లేస్‌లలో కొత్త చర్చకు దారితీస్తోంది.
దేశవ్యాప్తంగా 1,211 మంది ఓనర్స్, 2,533 మంది ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించి ఇండీడ్ క్వార్టర్లీ హైరింగ్ ట్రాకర్ రిపోర్ట్ రూపొందించారు. ఇందులో దాదాపు 60 శాతం మంది నిపుణులు తమకు ఇస్తున్న జాబ్ టైటిల్‌కు తగిన జీతం రావడం లేదని వాపోయారు. జీతాల పెంపు లేకపోయినా కేవలం పెద్ద హోదాలు ఇవ్వడాన్ని ‘ఇన్ఫ్లేటెడ్ జాబ్ టైటిల్స్’ అంటారు. ఇది ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ సాధారణమైపోయిందని 80 శాతం మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. అంటే జీతం పెంచరు కానీ పొజిషన్ పెంచుతారన్నమాట.
గత రెండేళ్లలో హోదా మారిన ప్రతి ముగ్గురిలో ఒకరి పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. హోదా పెరిగినప్పటికీ ఎలాంటి జీతాల పెంపు లేకపోవడం లేదా 5 శాతం కంటే తక్కువగా ఇంక్రిమెంట్ రావడం జరిగిందని చెప్పారు. బడ్జెట్ పరిమితులు ఉన్నప్పుడు ఉద్యోగులను నిలుపుకోవడానికి, కొత్తవారిని ఆకర్షించడానికి కంపెనీలు హోదాలను ఒక వ్యూహాత్మక సాధనంగా వాడుతున్నాయని సర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్న యజమానుల్లో 57 శాతం మంది ఇదే విషయాన్ని అంగీకరించారు కూడా.
►ALSO READ | E20 కష్టాలకు చెక్.. పాత వాహనాల కోసం మోడీ సర్కార్ మళ్లీ E10 పెట్రోల్ తెస్తోందా?
జీతాలు తక్కువగా ఉన్నప్పటికీ హోదాలకు ఉద్యోగులు పూర్తిగా ప్రాధాన్యం ఇవ్వడం మానేయలేదు. దాదాపు 70 శాతం మంది తమ హోదా భవిష్యత్తు అవకాశాలను ప్రభావితం చేస్తుందని ఇప్పటికీ నమ్ముతున్నారు. 73 శాతం మంది మంచి హోదా ఉంటే ఇతర కంపెనీలు తమను గొప్పగా చూస్తాయని భావిస్తున్నారట. ఏదేమైనప్పటికీ.. కొత్త అవకాశాలను పరిశీలించేటప్పుడు 52 శాతం మంది చెప్పుకోవటానికి గొప్పగా ఉండే జాబ్ హోదా కంటే మెరుగైన జీతాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తామని తేల్చిచెప్పారు.
ఈ విషయమై ఇండీడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శశి కుమార్ స్పందిస్తూ.. హోదాలు కేవలం ప్రత్యామ్నాయాలుగా మారకుండా నిజమైన కెరీర్ పురోగతిని ప్రతిబింబించినప్పుడే సార్థకత ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగులకు కేవలం పెద్ద పేర్లు మాత్రమే కాకుండా దానికి తగిన వేతనాలు కూడా ఉంటేనే కంపెనీల్లో నైపుణ్యం కలిగిన సిబ్బంది నిలకడగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు.
