- సెప్టెంబర్ 9 సాయంత్రం ఐదు గంటల వరకు గడువు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పోలీస్, అగ్నిమాపక, జైళ్లశాఖ, స్పెషల్ ప్రొటెక‌్షన్ ఫోర్స్, ఫింగర్ ప్రింట్ బ్యూరో తదితర విభాగాల్లో సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ కలిపి మొత్తం 7,437 పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 9 సాయంత్రం5 వరకు కొనసాగనుంది. అభ్యర్థులు ముందుగా www.tgprb.in వెబ్‌సైట్‌లో తమ మొబైల్ నంబర్‌ను యూజర్ ఐడీగా ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
అనంతరం తమకు ఆసక్తి ఉన్న నోటిఫికేషన్లు, పోస్టులను ఎంచుకుని దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియను పార్ట్-I, పార్ట్-IIగా నిర్వహిస్తారు. మొదట పార్ట్-I దరఖాస్తును సమర్పించాలి. దీనితో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, సంతకాన్ని కలిపి ఒకే జేపీజీ ఫైల్/ఇమేజ్‌గా స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తిరిగి పార్ట్-2 దరఖాస్తును సమర్పించాలి. ఈ దశలో అవసరమైన సర్టిఫికెట్లు, ఇతర ధ్రువపత్రాల స్కాన్ కాపీలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు గరిష్ట వయస్సును రెండేళ్లు సడలిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజా ఉత్తర్వుల ప్రకారం కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ట వయస్సు 29 ఏళ్లకు పెరగనుండగా..ఎస్సై పోస్టులకు గరిష్ట వయస్సు 32 ఏళ్లకు పెరగనుంది. దీనికి అదనంగా ఆయా రిజర్వేషన్ కేటగిరీ వారీగా అదనపు సడలింపు వర్తిస్తుంది.
