ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌ల రద్దులో ప్రభుత్వ అలసత్వం..కాక్రోచ్ జనతా పార్టీ ఆరోపణ

ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌ల రద్దులో ప్రభుత్వ అలసత్వం..కాక్రోచ్ జనతా పార్టీ ఆరోపణ
  •     వైఖరి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్

న్యూఢిల్లీ: విద్యార్థులు, నిరసనకారులపై నమోదు చేసిన ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌లను రద్దు చేయడంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆరోపించింది. మంగళవారం సుప్రీంకోర్టు వెలుపల సీజేపీ చీఫ్ స్పోక్స్‌‌‌‌పర్సన్ సౌరవ్ దాస్ మీడియాతో మాట్లాడారు. జులై 20న జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనల సందర్భంగా నమోదైన కేసుల జాబితాను కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు మూడుసార్లు ఆదేశించినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోందని తెలిపారు. 

కేంద్ర మంత్రులు ఇచ్చిన హామీ మేరకు సుప్రీంకోర్టు ఆర్టికల్ 142ను ఉపయోగించి దేశవ్యాప్తంగా నిరసనకారులపై పెట్టిన ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌లను రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పి దేశ ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి పరిహారం చెల్లింపులోనూ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే సీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తుందని, యువత మళ్లీ రోడ్డెక్కితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పోలీసుల అణచివేతపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేయనున్న హై-పవర్ కమిటీలో స్వతంత్ర నిపుణులతోపాటు తమ పార్టీ ప్రతినిధులను కూడా చేర్చాలని డిమాండ్ చేశారు.

మహిళా నిరసనకారులపై లైంగిక వేధింపులు..

మహిళా నిరసనకారులపై లైంగిక వేధింపులు, ఆన్‌‌‌‌లైన్ వేధింపుల ఆరోపణలపై సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. బాధ్యులు ఎవరైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. జులై 20 నాటి పార్లమెంట్ మార్చ్ వీడియో ఫుటేజ్, సీసీటీవీ రికార్డులను పరిశీలన కోసం ఉన్నత స్థాయి కమిటీకి అప్పగించనున్నట్లు తెలిపింది. ఈ కమిటీ ఏర్పాటుకు సంబంధించి బుధవారం అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.