ఏకే-47 కాల్పుల కేసులో ఎస్పీపై వేటు కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన బిహార్ సర్కారు

ఏకే-47 కాల్పుల కేసులో  ఎస్పీపై వేటు కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన బిహార్ సర్కారు

న్యూఢిల్లీ: బిహార్‌‌‌‌లోని సివాన్ జిల్లాలో ఇటీవల జరిగిన విద్యార్థి నిరసనల సమయంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఏకే-47 తుపాకీ ప్రయోగించిన వివాదం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై స్పందించిన బిహార్ ప్రభుత్వం సివాన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) పురన్ కుమార్ ఝాను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. తుపాకీ కాల్చిన కానిస్టేబుల్‌‌‌‌ను ఇప్పటికే సస్పెండ్ చేయగా, ఈ ఘటన జరిగిన సమయంలో బాధ్యతల్లో ఉన్న అధికారులకు ఇప్పటివరకు ఎలాంటి కొత్త పోస్టింగ్‌‌‌‌లు కేటాయించలేదు.

ఎస్పీ పురన్ కుమార్ ఝాకు కొత్త పోస్టింగ్ ఇచ్చే అంశంపై ప్రస్తుతం పరిశీలన కొనసాగుతోంది. కాగా రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో భోజ్‌‌‌‌పూర్, సివాన్ జిల్లాల ఎస్పీలతో సహా మొత్తం 18 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. పూరన్ కుమార్ స్థానంలో భరత్ సోనిని సివాన్ నూతన ఎస్పీగా నియమించారు. 

సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక

నిరసనకారులు చుట్టుముట్టి ఇబ్బంది పెట్టడంతోనే కానిస్టేబుల్ గాల్లోకి ఏకే-47తో 4 రౌండ్లు కాల్పులు జరిపినట్లు బిహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ కాల్పుల వల్ల ఎవరికీ గాయాలు కాలేదని తెలిపింది. అదేరోజు జరిగిన పోలీస్ చర్యలో ముగ్గురు నిరసనకారులకు చిన్నపాటి గాయాలపాలైనట్లు ప్రభుత్వం అంగీకరించింది.