హైకోర్టుకు లెటర్ రాసిన 2‌0 వేల మంది స్టూడెంట్లు.. బడుల్లో మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి

హైకోర్టుకు లెటర్ రాసిన 2‌0 వేల మంది స్టూడెంట్లు.. బడుల్లో మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి
  • హైకోర్టుకు లేఖలు రాసిన 2‌0 వేల మంది స్టూడెంట్లు
  • బడుల్లో మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి
  • సుమోటోగా విచారణ చేపట్టాలని పలు ప్రజాసంఘాల రిక్వెస్ట్

పంజాగుట్ట, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఉపాధ్యాయుల కొరత, తరగతి గదుల కొరత తీర్చడంతో పాటు మౌలిక సదుపాయాలు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పలు ప్రజాసంఘాలు హైకోర్టును కోరాయి. తమ స్కూళ్లలోని సమస్యలను పరిష్కరించాలని పేర్కొంటూ రాష్ర్ట వ్యాప్తంగా  20 వేల మంది విద్యార్థులు హైకోర్టుకు పోస్టు కార్డు ద్వారా తమ నిరసన తెలియజేశారని వెల్లడించాయి. విద్యార్థుల ఉత్తరాలపై సుమోటోగా విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశాయి. 

మంగళవారం సోమాజీగూడ ప్రెస్​క్లబ్​లో ఏర్పాటు చేసిన మీడియా  సమావేశంలో  డయల్ యువర్ విలేజ్ అధ్యక్షుడు రవిప్రకాశ్ మేరెడ్డి,  వందేమాతరం ఫౌండేషన్ అధ్యక్షుడు యడ్మ మాధవరెడ్డి, ఎమ్వీ ఫౌండేషన్​అధినేత సాయికుమార్ , పీపుల్స్​ పల్స్​ నాయకుడు దిలీప్ రెడ్డి, ప్రముఖ ఫొటో జర్నలిస్ట్​కందుకూరి రమేష్,  సురేష్ గుప్తా,  హై కోర్ట్ అడ్వొకేట్ సుమంత్ గరకరాజుల, మహిపాల్ రెడ్డి మాట్లాడారు.  20 వేల మంది విద్యార్థులు పాల్గొన్న ‘పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్’ వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలోని బడుగు బలహీనవర్గాల విద్యార్థుల రాజ్యాంగ బద్దమైన విద్యా హక్కును కాపాడాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ బడుల్లో పరిస్థితులను స్టూడెంట్లు పోస్టు కార్డుల ద్వారా హైకోర్టు న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు.

 కొత్త స్కూళ్ల సాకుతో ఇప్పటికే ఉన్న పాఠశాలలను నిర్లక్ష్యం చేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సర్కారు బడుల్లో మంచినీరు, మరుగు దొడ్ల సౌకర్యం కల్పించాలని.. ఉపాధ్యాయుల కొరత తీర్చి కొత్త గదులను నిర్మించాలన్నారు. కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కూడా లేదని వివరించారు. రాష్ర్టంలోని ఆదిలాబాద్​, నిజామాబాద్​, ఖమ్మం, పాలమూరు, హైదరాబాద్ జిల్లాలకు చెందిన 136 పాఠశాలల నుంచి విద్యార్థులు లేఖలు రాశారని ప్రజాసంఘాల నేతలు పేర్కొన్నారు.